ఉత్తరాంధ్రలో భూములన్నీ కబ్జాలు, ఆక్రమణలే అని... ఇప్పుడు కాకినాడ సెజ్‌ను కబళించారని యనమల రామకృష్ణుడు విమర్శించారు. కాకినాడ సెజ్‌పై సీఎం జగన్ కన్నేయడం ఇవాళ్టిది కాదని.. తనవి కాని భూములపై, 4 రెట్ల లాభం బినామీల ముసుగులో జగన్ పరం అవుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూముల యజమానులైన రైతుల నోళ్లలో మట్టి కొట్టడం హేయమని యనమల మండిపడ్డారు. రూ.5 వేల కోట్ల విలువైన కోన భూములు బినామీల పేర్లతో జగన్ హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు.
బినామీ పేర్లతో రూ.5వేల కోట్ల విలువైన భూములు హస్తగతం: యనమల - కాకినాడ సెజ్ విషయంపై యనమల మండిపాటు
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సెజ్ విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌పై తెదేపా నేత యనమల రామకృష్ణుడు తీవ్ర ఆరోపణలు చేశారు. బినామీల పేర్లతో రూ.5వేల కోట్ల విలువైన భూములు జగన్ హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు. ఇవాళో రేపో బందరు పోర్టు కూడా సీఎం బినామీల పరం అవుతుందన్నారు.
కాకినాడ సెజ్ విక్రయ లావాదేవీల లాభం రూ.4,700 కోట్లలో సగం స్థానిక రైతులకే ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు. ఏ1, ఏ2, ఏ3 ల మధ్య బినామీ అవినీతి లావాదేవీలపై దర్యాప్తు జరపాలన్నారు. పార్లమెంటు ఆమోదించిన కొత్త బినామీ చట్టం ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. కాకినాడ సెజ్‌లో బల్క్ డ్రగ్ పరిశ్రమ పెడితే కోనసీమ ప్రాంతం కాలుష్యమవుతుందని అభిప్రాయపడ్డారు. వందలాది హేచరీస్ అన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకునే ప్రమాదముందని హెచ్చరించారు. ఇవాళో రేపో బందరు పోర్టు కూడా ముఖ్యమంత్రి జగన్ బినామీల పరమవుతుందని యనమల అన్నారు.
విశాఖ నుంచి నెల్లూరు దాకా మొత్తం కోస్తా తీరం సీఎం జగన్ హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. కోనసీమ ప్రాంతాన్ని కబళించాలన్నది జగన్ 14ఏళ్ల కల. తండ్రి హయాంలోనే వాటిని సొంతం చేసుకోవాలని భావించారు. తెదేపా అడ్డుకోవటంతో ఆగారు. ఇప్పుడు సీఎం అయ్యాక మళ్లీ బినామీ సంస్థలతో కోన ప్రాంతం కైంకర్యం చేసే కుట్రలు చేస్తున్నారు. సీబీఐ ఛార్జిషీట్లలో సహ నిందితులే బినామీలుగా భూముల ఆక్రమణలు చేస్తున్నారు. -- యనమల రామకృష్ణుడు, తెదేపా నేత