1895 అక్టోబర్ 8న జన్మించిన బాపిరాజు కుటుంబ నివాసం... ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. కళకళలాడే ముఖం, కాంతి విరజిమ్మే కళ్లు, బుద్ధి చాతుర్యాన్ని చాటే విశాల ఫాలభాగం, చెక్కిళ్లపై ప్రవహించే చిరునవ్వు, పొందూరు ఖద్దరు లాల్చీ-ధోవతి ఆయన రూపం. బాపిరాజు కవి, కథకుడు, నవలా రచయిత, చిత్రకారుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు, చలన చిత్ర రంగంలో కళాస్రష్ట. బాపిరాజు ఎక్కడ ఉంటే అక్కడ ఒక కళాపీఠం, ఒక సాహితీ నందనం వెల్లివిరిసేది.
ఆయన జాతీయవాది. స్వాతంత్రోద్యమంలో కారాగారవాసం చేశారు. కొద్దికాలం భీమవరంలో న్యాయవాదిగా పని చేశారు. బందరు ఆంధ్ర జాతీయ కళాశాల ప్రధానాచార్యుడిగా కొంతకాలం బాధ్యతలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి వెలువడిన ‘మీజాన్’ దినపత్రికకు కొద్దికాలం సంపాదకుడిగా పని చేశారు. తెలుగువారి సంస్కృతి, చరిత్రల పట్ల ఆయనకు ఎనలేని మక్కువ. కవితలల్లినా, కథ రాసినా, నవలలు రచించినా, పాట పాడినా, బొమ్మగీచినా రమణీయ భావుకత ప్రదర్శించేవారు. ఆనాటి రాజమండ్రి కళాశాల ప్రధానాచార్యుడు ఆస్వాల్డ్ కూల్ గొప్ప చిత్రకారులు. ఆయన బాపిరాజులోని కళాపిపాసను, నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించారు. ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావుకు కూడా ఆయనే గురువు. అజంతా ఎల్లోరా గుహల కుడ్య చిత్రాలు దర్శించి, ఆ విశేషాలు ఆకళింపు చేసుకొని గొప్ప చిత్రకారులయ్యారు. ప్రమోద్ కుమార్ ఛటర్జీ వద్ద తన చిత్రకళా విజ్ఞానానికి మెరుగులు దిద్దుకున్నారు. గుంటూరు, భీమవరం, బందరు, హైదరాబాద్, మద్రాసు మొదలైన చోట్ల కళాపీఠాలు స్థాపించారు. తిక్కన, రుద్రమదేవి, సముద్రగుప్తుడు, బుద్ధుడు, మీరాబాయి చిత్రాలు బాపిరాజుకు విశేష ఖ్యాతిని ఆర్జించి పెట్టాయి.
బాపిరాజు లలిత కళాత్మకమైన శైలీ విన్యాసంతో కవిత్వం రాశారు. శశికళ ఆయన ఊహా ప్రేయసి. ‘గంగిరెద్దు’, ‘గోధూళి’, ‘వరద గోదావరి’ వంటి పాటల్లో గ్రామీణ జీవితాన్ని చిత్రించారు. బాపిరాజు కవిత్వంపై కీట్స్ ప్రభావం కనిపిస్తుంది. జానపదుల భాషలోనూ పాటలు రాశారు. తెలుగు నవలా చరిత్రలో బాపిరాజుది విశిష్టమైన అధ్యాయం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీలో ఆయన నారాయణరావు నవలకు విశ్వనాథవారి వేయిపడగలు నవలతోపాటు బహుమతి లభించింది. ఆ నవల జాతీయోద్యమాన్ని చిత్రించింది. అందులోని ప్రతిఘట్టం, ప్రతిపాత్ర సామాజిక వాస్తవికతకు ప్రతిబింబాలు. తెలుగువారి చరిత్రకు అద్దంపట్టే చారిత్రక నవలలు బాపిరాజును గొప్ప నవలాకారుడిగా నిలిపాయి. ‘గోనగన్నారెడ్డి’ నవలలో కాకతీయుల చరిత్రను చిత్రిస్తే, ‘హిమబిందు’ శాతవాహనుల నాటి ప్రణయగాథ. ‘అడవి శాంతిశ్రీ’లో తెలుగు ఇక్ష్వాకుల నాటి బౌద్ధ వైదిక స్పర్ధలను కళ్లకు కట్టించారు. కోనంగి, తుపాను, జాజిమల్లె నవలలు కూడా సమకాలీన సమాజపు విలువల్ని చిత్రించాయి. బాపిరాజు మంచి కథకులు కూడా. అద్భుత సన్నివేశాలతో ‘భోగీరలోయ’, ‘హిమాలయరశ్మి’, ‘తిరుపతి కొండ మెట్లు’, ‘నాగలి’ వంటి పెద్ద కథలు రచించారు.
కథల్లో సమకాలీన రాజకీయ ఉద్యమాన్ని, రైతుల స్థితిగతుల్ని, అనేక సామాజిక సమస్యల్ని చిత్రించారు. కథల్లో పాటలు రాయడం ఆయన ప్రత్యేకత. కథనంలో అపూర్వ శిల్ప విన్యాసం గోచరిస్తుంది. ఆయన సినిమారంగం వైపు ఆకర్షితులై అనసూయ, మీరాబాయి, ధ్రువ విజయం, మొదలైన చిత్రాలకు కళా దర్శకత్వం వహించారు. కావ్యంలో చిత్రకళాధర్మం, చిత్రరచనలో కావ్యకళాధర్మం మేళవించి రెంటికీ నవీనత్వమిచ్చిన ప్రతిభాశాలి బాపిరాజు. సంస్కరణ దృష్టితో ఉదాత్త పాత్రల్ని సృష్టించారు. గ్రాంధిక, వ్యవహారిక రూపాలు రెండింటినీ సందర్భోచితంగా ప్రయోగించారు. ఈ బహుముఖ ప్రజ్ఞానిధి 1952 సెప్టెంబరు 22న లోకం నుంచి నిష్క్రమించారు.
ఇదీ చదవండి:విద్యార్థుల ఎంపికను తాత్కాలికంగా నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశం