గాంధీ, ఉస్మానియా పేదల ఆస్పత్రులుగా పేరొందాయి. ఈ రెండు చోట్ల అనధికారిక పడకలతో కలుపుకుంటే నాలుగు వేలు ఉన్నాయి. రోజూ రెండు దవాఖానాలకు దాదాపు ఓపీ విభాగం కింద 2500 మంది రోగులు వచ్చి వైద్య సహాయం పొందుతుంటారు. గాంధీ ఆస్పత్రిలోని ఏ భవనానికీ సరిగా అగ్నిమాపక వ్యవస్థలేదు. ఇటీవలే ఒక వాహనంతో అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేసినా అంత పెద్ద భవనాలకు ఇదొక్కటే సరిపోని పరిస్థితి. అగ్నిమాపక వ్యవస్థ ఏర్పాటుకు రూ.2 కోట్ల మేర అవుతుందని అంచనా వేసినా కూడా తర్వాత దీని గురించి పట్టించుకోలేదు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ పరిధిలో రూ.15 కోట్ల వరకు ఉన్నా దీనికి మాత్రం నిధులను వ్యయం చేయలేదు. ప్రస్తుతం 189 సీసీ కెమెరాలు ఉండగా అందులో చాలా వరకు పని చేయడం లేదు. విస్తరించిన ఆస్పత్రిలో మరో వంద కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ లేదు. ఏడాదికి రూ.2 కోట్ల వ్యయం అవుతుందని ఈ కాంట్రాక్టును ఎవరికీ ఇవ్వలేదు. గాంధీ ఆసుపత్రిలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ఆసుపత్రి ప్రధాన భవనం సెల్లార్‌లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉన్నది. అక్కడే రోగులకు అవసరమైన ఆహారం తయారుచేసే వంటశాలతోపాటు పలు విభాగాలు కొనసాగుతుండగా, తరచూ పొంగే డ్రైనేజీ నీటి వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోగుల సహాయకుల కోసం ఉండేందుకు వసతి లేక చెట్ల కింద పడిగాపులు పడాల్సి వస్తోంది.
ఉస్మానియాలో పరిస్థితి అంతే!
గాంధీలో కరోనా చికిత్సలు జరుగుతుండటంతో ఉస్మానియాకు రోగులు పోటెత్తుతున్నారు. ఇక్కడికి వచ్చిన రోగులకు పూర్తిగా పడకలు దొరక్క నేలమీదే పడుకుని వైద్యం పొందాల్సి వస్తోంది. ఏడాదిన్నర క్రితం కురిసిన వర్షాల వల్ల పాత భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లోకి వరద చేరింది. రోగులు, వైద్యసిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాత భవనం శిథిలమై, జీర్ణదశకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో గతేడాది జులై నుంచి పాత భవనాన్ని ప్రభుత్వం మూసివేసింది. పెరుగుతున్న రోగుల రద్దీకి అనుగుణంగా ఉస్మానియాలో వార్డులు అందుబాటులో లేకుండా పోయాయి. గత్యంతరం లేని స్థితిలో వైద్య సిబ్బంది రోగులను నేలపైనే పడుకోబెట్టి సేవలు అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలై నడవలేని నిస్సహాయ స్థితిలో ఉండే రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ఆస్పత్రిలో కూడా అగ్నిమాపక వ్యవస్థ లేదు. రోగుల సహాయకులు ఉండటానికి ఎటువంటి ఏర్పాట్లు లేవు. ఇక్కడ కూడా చాలా వరకు సీసీ కెమెరాలు పని చేయడం లేదు.
కూలకముందే మేల్కోండి…..!