తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రపంచంలో ఖరీదైన కాడ కూర.. హాప్ షూట్స్ - One kilogram hop-shoots costs one lakh rupees

మన ఆకుకూరలు లేదా కూరగాయలైనా పాశ్చాత్యదేశాల్లో తినే సలాడ్‌ ఆకులయినా ఎంత ధర పలికినా కిలో వెయ్యి రూపాయలకు మించవు. కానీ కేజీ దాదాపు లక్షరూపాయల వరకూ పలికే కూరగాయ ఒకటి ఉంది. దాని పేరే హాప్‌ షూట్స్‌. ప్రపంచంలోకెల్లా ఖరీదైన ఈ కాడ కూర ఇప్పుడు మనదేశంలోనూ పండుతోంది. బిహారీ రైతు అమ్రేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ పంటకి శ్రీకారం చుట్టడం విశేషం.

World's costliest crop hop-shoots is now under cultivation in Bihar
ప్రపంచంలో ఖరీదైన కాడ కూర.. హాప్ షూట్స్

By

Published : Feb 21, 2021, 1:17 PM IST

ఇంటిమీద పెంకులమ్మయినా పులస చేప తినాల్సిందే అనేది గోదావరి జిల్లాల్లో వినిపించే నానుడి. అప్పు చేసయినా సరే హాప్‌ షూట్స్‌ తినాల్సిందే అంటారు యూరోపియన్లు. మనం రుచికోసం పులస చేపను తింటే, ఆరోగ్యం కోసం హాప్‌ షూట్స్‌ తింటారక్కడ. ఆకులూ కాడలూ పువ్వులూ కాయలూ... ఇలా మొక్కలోని భాగాలన్నీ ఔషధాలే కావడంతో దీన్ని కూరగాయగా వాడటమే కాదు, మందుల తయారీలోనూ వాడుతుంటారు. అందుకే అక్కడ అది ఖరీదైన కూర మొక్కగా పేరొందింది. అలాంటి పంటని ఇప్పుడు మనదగ్గరా పండిస్తున్నాడు బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాకు చెందిన అమ్రేష్‌ అనే రైతు.

ఎలా తింటారు?

హాప్ షూట్స్ సలాడ్

రోజుకి ఆరు అంగుళాల పొడవుతో ఎంతో వేగంగా పెరుగు తాయి హాప్‌ షూట్స్‌. ముఖ్యంగా మొక్క వేరు మొదలు నుంచి వచ్చే కాడలు లేతగా ఉన్నప్పుడు ఊదారంగులో ఉండి, ఆకులు పెరిగే సమయానికి నెమ్మదిగా ఆకుపచ్చ రంగులోకి మారతాయి. ఈ రెండు దశల్లోనూ వీటిని తింటుంటారు. అయితే కాస్త ముదిరి, ఆకుపచ్చరంగులోకి మారిన కాడలు చేదుగా ఉండటంతో- స్ప్రింగ్‌ సీజన్‌లో వచ్చే ఊదారంగు లేత కాడల్నే ఎక్కువగా విక్రయిస్తుంటారు. వీటిని సలాడ్లలోనూ గ్రిల్‌ చేసీ లేదా ఉడికించి తినడం చేస్తుంటారు. వెనిగర్‌లో నిల్వచేసుకునీ తింటుంటారు. హాప్‌ షూట్స్‌లోని యాంటీఆక్సిడెంట్లు వయసు మీద పడనీయవన్న కారణంతో వీటిని ఆహారంలో భాగంగా తింటుంటారు. హాప్‌ కోన్స్‌గా పిలిచే ఈ మొక్కల పువ్వుల్ని బీర్‌ తయారీలో వాడతారు. ఈ పూల వాసన వల్ల బీర్‌కి మంచి ఫ్లేవర్‌ వస్తుందట. ఈ పూలని అరోమాథెరపీకీ ఉపయోగిస్తారట. వీటి కాడల్లోని హ్యూములోన్స్‌, ల్యుపులోన్స్‌ అనే ఆమ్లాలు క్యాన్సర్‌ కణాల్ని నాశనం చేస్తాయట. జీర్ణశక్తిని పెంచడంతోపాటు డిప్రెషన్‌, ఆందోళన, నిద్రలేమి వంటి వాటిని తగ్గించేందుకూ తోడ్పడతాయని చెబుతారు. యాంటీబయోటిక్‌ గుణాలు మెండుగా ఉండే ఈ కాడలు టీబీ వ్యాధినీ తగ్గిస్తాయట. పంటి నొప్పినీ నివారిస్తాయి. అందుకే ఐరోపా దేశాల్లో చేదుగా ఉన్నప్పటికీ పచ్చికాడల్ని తింటుంటారు.

హాప్ షూట్స్

ఎక్కడెక్కడ?

ఔరంగాబాద్​లో హాప్ షూట్స్ సాగు

హాప్‌ షూట్స్‌లోని ఔషధగుణాల్ని ఎనిమిదో శతాబ్దంలో గుర్తించారట. తొలిసారిగా జర్మన్లూ, తరవాత ఆంగ్లేయులూ పండించడం ప్రారంభించారు. ఇంగ్లండ్‌లో బీరు తయారుచేస్తే అందులో తప్పనిసరిగా హాప్‌ షూట్స్‌ వాడాల్సిందే అన్న నిబంధన ఉంది. ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల పండిస్తున్నారు. మనదగ్గర హిమాచల్‌ప్రదేశ్‌లోనూ వీటిని పండించేవారట. కానీ సరైన మార్కెట్‌ లేకపోవడంతో రైతులు ఈ పంట వేయడం మానేశారట. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కాడల ధర కిలో వెయ్యి యూరోలకి పైనే ఉండటం చూసిన అమ్రేష్‌కి వీటిని పెంచాలన్న ఆలోచన వచ్చి, ఈ మొక్కల నారు కోసం వారణాసి ఇండియన్‌ వెజిటబుల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ని సంప్రదించాడట. అక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉన్న డాక్టర్‌ లాల్‌ ప్రోత్సహించడంతో హాప్‌ షూట్స్‌ను పండిస్తున్నాడు అమ్రేష్‌. ప్రత్యేకమైన ఈ కూర మొక్కతోపాటు ఇతరత్రా ఔషధమొక్కల్నీ పెంచుతున్నాడు అమ్రేష్‌. ఇది చూసి ఆ చుట్టుపక్కల రైతులూ దీన్ని పండించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన పంటలకిమద్దతుధర ఇవ్వడంతోపాటు ఎగుమతులకు మార్గం సుగమం చేస్తే రైతులు వాణిజ్యపరమైన ఔషధ మొక్కల్నీ పండించేందుకు ముందుకు వస్తారు. ఈ పంటలవల్ల రైతులతోపాటు ఫార్మాకంపెనీలకీ కాస్మొటిక్స్‌ పరిశ్రమకీ కూడా లాభదాయకమే అంటున్నాడు అమ్రేష్‌. ఆయన పంట పండి మన దగ్గరా ఔషధభరిత కూరగాయలు పండాలని కోరుకుందామా..!

ABOUT THE AUTHOR

...view details