తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉత్సాహంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు - world telugu mahasabhalu

ఏపీలోని విజయవాడ సిద్ధార్థ కళాశాల వేదికగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు రెండో రోజూ ఉత్సాహంగా సాగాయి. రాజకీయ, పాలనా రంగ ప్రతినిధుల సదస్సులు, సంగీత నవావధానం, తెలుగు వారి నృత్య రీతులు, తెలుగు భాషోద్యమ గీతాలు నిర్విరామంగా కొనసాగాయి. మీగడ రామలింగస్వామి సంగీత నవావధానం, రంగం రాజేష్ తెలుగు భాషోద్యమ గీతాలకు మంచి స్పందన లభించింది. మహాసభల చివరి రోజైన ఇవాళ రాష్ట్రేతర ప్రతినిధులు సదస్సు, పత్రిక ప్రసార మాధ్యమ రంగ ప్రతినిధుల సదస్సులు జరగనున్నాయి.

teluhu mahasabhalu
ఉత్సాహంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

By

Published : Dec 29, 2019, 9:07 AM IST

ఉత్సాహంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

ప్రాథమిక విద్య మాతృ భాషలో లేకపోతే... సృజనాత్మకత ఉండదని ప్రపంచ తెలుగు మహాసభల్లో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలోని విజయవాడ సిద్ధార్థ కళాశాల వేదికగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఉత్సాహంగా సాగుతున్నాయి. తెలుగు రచయితల మహాసభల్లో కీలకమైన రాజకీయ రంగ ప్రతినిధుల సదస్సు అనంతరం... ప్రముఖ అవధాని మీగడ రామలింగ స్వామి నిర్వహించిన సంగీత నవావధానం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. మరో వేదికపై సాంకేతిక రంగ ప్రతినిధుల సదస్సులు, తెలుగు భాషోద్యమ ప్రతినిధుల సదస్సులు నిర్విరామంగా నిర్వహించారు. పలువురు రచయితలు పుస్తకాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

ఆకట్టుకున్న నృత్యరీతులు

సంగీత అవధానం అనంతరం... ప్రముఖ నృత్య దర్శకులు సప్పా దుర్గా ప్రసాద్ అనునయించిన తెలుగు వారి ఆలయ నృత్య రీతులు ఆకట్టుకున్నాయి. పాలకులే మాతృభాషను మరిచిపోతుంటే.... విదేశాల్లో తెలుగు కోసం అహర్నిశలు పాటు పడుతూ... తెలుగు వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తున్న విదేశీ తెలుగు ప్రతినిధులు చేస్తున్న కృషి మరువలేనిదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

తెలుగు సొగసు అంశంపై ప్రసంగం

ప్రజా సాంస్కృతిక వేదిక రాజేష్ బృందం... తెలుగు భాషోద్యమ గీతాలు, విప్లవ గీతాలతో ఆహూతులను విశేషంగా అలరించింది. ప్రముఖ కావ్య గాయకుడు పాలగుమ్మి రాజగోపాల్.. కావ్యాల్లో తెలుగు సొగసు అనే అంశంపై గాన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. యువత - తెలుగు భవిత అనే అంశంపై ప్రసంగించిన సినీగేయ రచయిత అనంత్ శ్రీరామ్ తన ప్రసంగాన్ని కవిత ద్వారా ప్రారంభించి అలరించారు. మూడు రోజుల ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నేటితో ముగియనున్నాయి.

ఇవీ చూడండి: ఉత్సాహంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

ABOUT THE AUTHOR

...view details