తెలంగాణ

telangana

ETV Bharat / city

అతివలూ.. ప్రమాదంలో ఉంటే సమాచారమివ్వండి - ప్రమాదంలో ఉంటే సమాచారమివ్వండి

ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటాం. కానీ ఆ సంబురం ఎన్నాళ్లు.. అడుగడుగునా ఆబగా తడిమే కళ్లు.. అత్యాచారాలు చేసి చంపేసే మృగాళ్లు నిస్సిగ్గుగా, నిర్భయంగా సంచరిస్తున్న ఈ సమాజంలో ‘ఆమె’కేదీ రక్షణ! గడప దాటిన బిడ్డ తిరిగి గూడు చేరేవరకు అమ్మానాన్నలకు అనుక్షణం భయమే.. అక్కా చెల్లీ, అమ్మా వదినా.. అతివ ఎవరయినా ఆపదల్లో పయనమే..

women help center phone numbers
అతివలూ.. ప్రమాదంలో ఉంటే సమాచారమివ్వండి

By

Published : Nov 30, 2019, 10:10 AM IST

మహిళను ఒంటరిగా బయటికి పంపాలంటే కుటుంబసభ్యులు భయపడే పరిస్థితులు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా హైదరాబాద్‌ శివార్లలో ఓ యువతి దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మనకే అలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేయాలి? తక్షణ సాయం కోసం ఎవర్ని, ఎలా సంప్రదించాలి? అత్యవసర, విపత్కర స్థితిలో ఉన్నట్లు పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారాన్ని ఎలా చేరవేయాలి? తదితర సందేహాలు అందరికీ వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఫోన్‌ కాల్‌తో సమాచారాన్ని చేరవేయగలిగితే చాలు. తక్షణ సాయం అందించడానికి పోలీసులు సిద్ధంగా ఉంటారు. తద్వారా ప్రమాదం నుంచి బయటపడడమే కాదు.. నేరగాళ్ల ఆటకట్టించవచ్చు.


ఏ నంబరుకు చేస్తే ఎలా ఆదుకుంటారు

డయల్​ 100

100

రాష్ట్రంలోని ఏ మూల నుంచైనా ఈ నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు. ఆ కాల్‌ పోలీసు కంట్రోల్‌రూమ్‌కు చేరుతుంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నారో చెబితే చాలు.. బాధితులు ఏ ప్రాంతం నుంచి ఫోన్‌ చేశారో తెలుసుకుంటారు. సమీపంలో ఉన్న పోలీసులను, గస్తీ వాహనాలను అప్రమత్తం చేసి గరిష్ఠంగా ఆరు నిమిషాల్లో అక్కడికి పంపిస్తారు. జీపీఎస్‌ లొకేషన్‌ ఆధారంగా ఆ ప్రదేశానికి చేరుకుని బాధితులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నా కాపాడతారు. అవసరమైతే ఆ ఘటనా స్థలానికి చేరుకునేంతవరకూ కూడా పోలీసులు బాధితులతో మాట్లాడుతూ వారికి సూచనలు, సలహాలు ఇస్తూ ధైర్యం చెబుతారు.

ఎమర్జెన్సీ నంబర్​ 112

112

కేంద్ర హోం శాఖ ఈ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఈ నంబర్‌కు కాల్‌ చేయొచ్చు. బాధితులు ఏ రాష్ట్రం నుంచి ఫోన్‌ చేస్తే.. ఆ రాష్ట్రంలోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు కాల్‌ వెళ్తుంది. ఏ ప్రదేశం నుంచి కాల్‌ వచ్చిందో అక్షాంశాలు, రేఖాంశాలు సహా కంట్రోల్‌ రూమ్‌లో తెలుస్తుంది. వెంటనే సమీపంలోని పోలీసులను, గస్తీ వాహనాలను పంపించి బాధితులను కాపాడతారు.

182 రైల్వే రక్షక దళం కంట్రోల్‌ రూమ్‌

182

మహిళలు ఒంటరిగా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు.. ఎవరి నుంచైనా వేధింపులు ఎదురవుతుండొచ్చు. లేదా ఆపదలో చిక్కుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో 182 నంబర్‌కు ఫోన్‌ చేయాలి. ఆ కాల్‌ రైల్వే డివిజన్‌ పరిధిలోని రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్‌) కంట్రోల్‌ రూమ్‌కు చేరుతుంది. బాధితులు చెప్పే వివరాల ఆధారంగా ఆ రైల్లో ఉన్న ఆర్పీఎఫ్‌ సిబ్బంది వెంటనే బోగిలోకి చేరుకుని సాయమందిస్తారు.

షీ బృందాలు

9490616555

మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్​లను ఏర్పాటు చేసింది. ఎలాంటి ఆపదలో ఉన్న ఈ నంబర్​ను ఫోన్​ చేసి చెప్పొచ్చు. షీ బృందాలు వెంటనే స్పందించి అవసరమైన సాయమందిస్తారు. 24 గంటలూ ఇది పనిచేస్తుంది.

112 యాప్​

112 మొబైల్‌ యాప్‌ను వినియోగించుకోండి

  • కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యాప్‌ మహిళలకు ఎంతో ఉపయోగం.
  • ఐవోఎస్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ప్రొఫైల్‌లో మీ పేరు, ఫోన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, రాష్ట్రం తదితర వివరాలు నమోదు చేసుకోవాలి.
  • ఆపదలో ఉన్నప్పుడు ఆ సమాచారం పోలీసులతో పాటు కుటుంబసభ్యులకు తెలిసేలా.. ముఖ్యమైన వారి ఫోన్‌ నెంబర్లనూ దీనిలో సేవ్‌ చేసుకోవచ్చు.
  • హోం స్క్రీన్‌పైకి వెళ్లిన వెంటనే పోలీస్‌ అని కనిపిస్తుంది. ఆ అత్యవసర మీటను నొక్కితే చాలు వారు ఆపదలో ఉన్నట్లు పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుంది. బాధితులున్న లొకేషన్‌ వివరాలు కూడా చేరతాయి. వెంటనే 112 నంబర్‌ నుంచి కాల్‌ వస్తుంది. సమీపంలోని పోలీసులు, గస్తీ వాహనాలు అప్రమత్తమై సాయమందిస్తారు.
    గూగుల్​ లోకేషన్​

సాంకేతికత.. ఎంతో రక్ష

  • గూగుల్‌ మ్యాప్స్‌లో రియల్‌టైమ్‌ లొకేషన్‌ షేర్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. మహిళలు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు కుటుంబసభ్యులకు దాన్ని షేర్‌ చేస్తే సరిపోతోంది. ఆపదలో చిక్కుకున్నట్లు వారికి సమాచారమందిస్తే పోలీసులకు చెప్పటానికి కానీ, వారే నేరుగా ఆ ప్రదేశానికి చేరుకోవటానికి కానీ అవకాశం ఉంటుంది.
  • వాట్సాప్‌లో కరెంట్‌ లొకేషన్‌, లైవ్‌ లొకేషన్‌ అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. దీనిలో లైవ్‌ లొకేషన్‌ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు.
  • ఒంటరిగా వెళ్తున్నప్పుడు, నిర్మానుష్య ప్రదేశాల మీదుగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, రాత్రి వేళ ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు పైన పేర్కొన్న సాంకేతిక సదుపాయాలు వినియోగించుకోవచ్చు.
  • ఆటోలు, ట్యాక్సీలు, ఉబర్‌, ఓలా, ర్యాపిడో వంటి యాప్‌ల ద్వారా వాహనాలను బుక్‌ చేసుకుని ప్రయాణిస్తున్నప్పుడు కూడా లైవ్‌ లొకేషన్‌ను కుటుంబసభ్యులకు షేర్‌ చేస్తే.. ఆ వాహనం సరైన మార్గంలోనే వెళ్తుందా? దారి మళ్లించారా? అనేది గుర్తించి అప్రమత్తమయ్యేందుకు వీలుంటుంది.

ఈ జాగ్రత్తలూ అవసరం

  • ప్రతి ఒక్కరూ తమ ఫోన్‌లో 112 నంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి. హోం స్క్రీన్‌పై షార్ట్‌కట్‌లో ఈ నంబర్‌ పెట్టుకోవాలి. దాన్ని నొక్కితే చాలు కాల్‌ వెళ్లేలా చూసుకోవాలి.
  • ఫీచర్‌ ఫోన్‌ వినియోగిస్తున్న వారైతే కీ పాడ్‌పై 5 లేదా 9 నంబర్‌ను గట్టిగా పట్టుకుని నొక్కితే 112కు కాల్‌ వెళ్లిపోతుంది. ఫోన్‌లోని పవర్‌బటన్‌ను పట్టుకుని.. వరుసగా మూడుసార్లు కదిపితే చాలు 112కు కాల్‌ చేరుతుంది.

ఇదీ చూడండి:మహిళలపై ఆగని అకృత్యాలు... 'నిర్భయ'మేదీ?

ABOUT THE AUTHOR

...view details