తెలంగాణ

telangana

ETV Bharat / city

ఊరు ఊరే కూరగాయల తోటగా మారితే.. - రామభద్రపురంలో కూరగాయల సాగు వార్తలు

ఊళ్లో కూరగాయలు పండించడం మనకు తెలుసు. కానీ ఒక ఊరే కూరగాయల తోటగా మారితే... అది రామభద్రపురం. ఏపీ విజయనగరం జిల్లాలోని ఈ గ్రామానికి ఇంతటి ప్రత్యేకత తెచ్చిపెట్టింది అక్కడి మహిళలే. ఆ ఊళ్లోని దాదాపు ప్రతి గడప నుంచి కూరగాయలు పండించే మహిళలు కనిపిస్తారు. వీళ్లే గ్రామానికి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, పొరుగునున్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారు.

ఊరు ఊరే కూరగాయల తోటగా మారితే..
ఊరు ఊరే కూరగాయల తోటగా మారితే..

By

Published : Dec 17, 2020, 3:49 PM IST

ఏపీ విజయనగరం జిల్లా రామభద్రపురంలో సుమారు 500 కుటుంబాలకు కూరగాయల సాగు ప్రధాన వృత్తి. వారంతా తరతరాలుగా సాగులోనే కొనసాగుతున్నారు. అధిక దిగుబడులు సాధించడంలో అన్నిరకాల మెలకువలు పాటించి సిరులు కురిపిస్తున్నారు. గ్రామం పరిధిలో సుమారు ఏడెనిమిది వందల ఎకరాల్లో క్యాబేజీ, టొమాటో, బీర, బెండ, ఆనప, కాకర, దొండ, బీట్రూట్, క్యారట్, ముల్లంగి, మిరప... ఇలా ప్రతి రకం పండిస్తారు. వీటితోపాటు డిమాండు ఉన్న పూలు, ఆకుకూరల సాగూ చేపడుతూ సేద్యంలో తమకు తిరుగులేదంటున్నారు.

ఒకప్పుడు కుటుంబ సభ్యులంతా ఈ పనుల్లో ఉండేవారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో క్రమంగా మగవాళ్లు కూలీ పనులూ, ఇతర వృత్తుల్లోకి వెళ్లారు. పాతికేళ్లుగా మహిళలే ఈ బాధ్యతని తీసుకున్నారు. నారు వేయడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, చీడపీడల బారిన పడకుండా వాటిని సంరక్షించుకోవడం, ప్రతి కమతానికి సాగునీరు వెళ్లేలా తార్లు తీయడం... లాంటి అన్ని పనులు మహిళలే చేస్తారు. కూరగాయల సాగులో వచ్చే వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారుచేసి వినియోగిస్తుంటారు.

సాగులో మార్పులు...

ప్రకృతి సహకరించకపోవడం, ఒక తరహా పంటలు వేయడం వల్ల కొన్నేళ్ల కిందట కూరగాయల సాగు నష్టాలనే తెచ్చేది. పొలాల బాధ్యత మహిళలు తీసుకున్నాక మిశ్రమ పంటలు పండించడం, కొత్త రకాల్ని సాగుచేయడం లాంటి మార్పులు తీసుకొచ్చి దాన్ని లాభాల బాట పట్టించారు. ఇక్కడ ఏడాది పొడవునా పొలంలో పంట పండిస్తారు. ప్రతి పంటమీదా పెట్టుబడికి దాదాపు మూడింతల లాభం చేకూరుతుందని చెప్పే ఈ మహిళలు దానికి తగ్గట్టుగానే ఆరుగాలం శ్రమిస్తున్నారు.

పొలంలో పండిన కూరగాయల్ని రోజూ ఉదయం, సాయంకాలం కోసి ఊళ్లోని మార్కెట్​కు తీసుకొస్తారు. అమ్మకాల్లోనూ వీరే కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరు పండించిన కూరగాయల్ని కొందరు స్థానిక మార్కెట్‌లో అమ్మకానికి పెడతారు. అధిక మొత్తంలో సాగుచేసేవాళ్లు స్థానికంగా ఉండే వ్యాపారులకు అమ్ముతారు. ఇక్కడి నుంచి కూరగాయలు శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరిజిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌కూ ఎగుమతి అవుతున్నాయి. రోజూ పది ట్రక్కుల్లో కూరగాయలు ఇక్కడి నుంచి వెళ్తాయి. వంగ, టొమాటో, మిర్చి... ఇలా చాలా రకాల నారును వీరు పెంచుతారు. చుట్టుపక్కల గ్రామాల రైతులకు నారును విక్రయించి అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు.

ఈ గ్రామంలో మెట్ట ప్రాంతం ఎక్కువ. ఊరికి ఏ దిక్కుగా వెళ్లి చూసినా పొలాల్లో మహిళలు బృందాలుగా పనిచేస్తూ కనిపిస్తారు. భర్తలు ఇతర వృత్తుల్లో, భార్యలు వ్యవసాయంలో ఆర్జించడంతో ఈ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు ఎంతో మెరుగయ్యాయి. విద్య, వైద్యపరంగా ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడిప్పుడే ఈ గ్రామంలోకి పట్టణాల్లో ఉండే సౌకర్యాలూ వస్తున్నాయి. ‘కూరగాయల సాగు చిన్నప్పట్నుంచీ మా జీవితంలో భాగమైపోయిది. ఈ అనుభవంతో కూరగాయల పెంపకం, అమ్మకం... ఎక్కడా మగవాళ్ల ప్రమేయం లేకుండా చూసుకోగలుగుతున్నాం. సేంద్రియ ఎరువు వాడకంపై దృష్టి పెట్టాం. దీంతో అధిక దిగుబడులు వస్తున్నాయి. పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతోంది.

కమతాలు దగ్గరగా ఉండటంతో పొరుగునుండే రైతుల సహకారం అన్నింటిలోనూ ఉంటోంది’ అని చెబుతోంది 40 ఏళ్ల సింహాచలమమ్మ. ‘తాతల నుంచి కూరగాయల సాగే జీవనాధారం. మొదట్లో బీర, కాకర, ఆనపలాంటి పంటలే సాగుచేసేవాళ్లం. తర్వాత క్యారెట్‌, బీట్‌రూట్‌ సాగునీ తెలుసుకున్నాం. చీకటితోనే పొలంలో అడుగుపెడతాం. పంట కోసి మార్కెట్‌లో సరకు అమ్మి వచ్చి, మళ్లీ చీకటి పడేంతవరకూ పొలంలోనే ఉంటాం’ అని చెబుతోంది 36 ఏళ్ల కోట తవుడమ్మ. ఇప్పటికీ పంట వేసిన ప్రతిసారీ లాభాలు వస్తాయని గ్యారంటీ లేదు. అయినా సరే వాళ్లు భూమిని నమ్ముకునే ఉంటారు. సాగులో కొత్త పద్ధతుల్ని తెలుసుకుంటూ ముందడుగు వేస్తారు.

ఇదీ చూడండి:డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ 2వారాలకు వాయిదా

ABOUT THE AUTHOR

...view details