జాతీయ స్థాయిలో సగటున 3.3% మంది మహిళలకు గర్భసంచులు తొలగించగా తెలుగు రాష్ట్రాల్లో అంతకు రెండున్నర రెట్ల సంఖ్యలో ఈ శస్త్రచికిత్సలు జరిగాయి. వీటి విషయంలో తెలుగు రాష్ట్రాల దరిదాపుల్లో బిహార్ (6%) తప్ప మరే రాష్ట్రం లేదు. జాతీయస్థాయిలో 40-49 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో (9.7%) ఎక్కువగా తొలగించారు. గ్రామీణ ప్రాంతాల్లో సగటున 34 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 36.5 ఏళ్లలో మహిళలకు గర్భసంచులు తొలగించేస్తున్నారు. ఇందులో 30% ఆపరేషన్లు ప్రభుత్వరంగ ఆసుపత్రుల్లో జరుగుతుంటే, 70% ప్రైవేటు ఆసుపత్రుల్లో సాగుతున్నాయి. సామాజికవర్గాలవారీగా చూస్తే ఓబీసీ మహిళల్లో (3.6) అత్యధికంగా గర్భసంచులను తొలగించారు. ఆ తర్వాతి స్థానంలో జనరల్ (3.2%), ఎస్సీ (3.1%), ఎస్టీ (2.2) మహిళలున్నారు. ఏ సామాజికవర్గమో తెలియని వారు 3.7% మంది కనిపించారు. ఆదాయపరంగా చూస్తే మధ్యతరగతి మహిళలు (3.7%) ఈ కోతలకు ఎక్కువ లోనయ్యారు. అత్యధిక ఆదాయ వర్గాల్లో (2.8%) కోతల సమస్య తక్కువగానే ఉంది.
మేనరిక వివాహాలు దక్షిణాదిలో అధికం.. :మేనరిక వివాహాలు దక్షిణాదిలో అధికంగా ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. ఇందులో తమిళనాడు, కర్ణాటకలు తొలి రెండు స్థానాలను ఆక్రమిస్తే ఆంధ్రప్రదేశ్ 3, తెలంగాణ 5వ స్థానంలో నిలిచాయి.
టీనేజ్ తల్లుల్లో తెలంగాణకు పదమూడో స్థానం..:15-19 ఏళ్ల వయసులోపే అత్యధిక మంది తల్లులు అవుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో త్రిపుర (22%), పశ్చిమబెంగాల్ (16%) తర్వాతి స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ (13%) ఆక్రమించింది. ఇది జాతీయ సగటు 6.8%కంటే దాదాపు రెట్టింపు. ఈ విషయంలో తెలంగాణ (5.8%) 13వ స్థానంలో నిలిచింది.