Woman Questions MLA in Guntur : ‘ఏపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు మాకు అందడం లేదు. అయినా నా పేరుతో రూ.59,600 ఇచ్చినట్లు పుస్తకంలో ముద్రించారు. ఆ డబ్బులు మొత్తం ఎవరు తీసుకున్నారు?...’ అంటూ గుంటూరు నెహ్రూనగర్ చేనేత కాలనీకి చెందిన సజ్జ సుబ్రహ్మణ్యేశ్వరి.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాను ప్రశ్నించారు. మంగళవారం రోజున ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఇంటి వద్దకు వచ్చిన ఎమ్మెల్యేను.. సుబ్రహ్మణ్యేశ్వరి ఆప్యాయంగా పలకరించి మామిడికాయ ఇవ్వగా.. ఆయన బాగుందన్నారు.
ఒక్క పైసా ఇవ్వకుండా.. ఇచ్చినట్లెలా ముద్రిస్తారు? - గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫాను నిలదీసిన మహిళ
Woman Questions MLA in Guntur : ఏపీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు కొందరికి అందకున్నా.. అందినట్లు ముద్రిస్తున్నారు. ఈ విషయంపై.. మంగళవారం రోజున గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫాను.. ఓ మహిళ నిలదీసింది. విషయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే.. సచివాలయ సిబ్బందిని ప్రశ్నించగా.. వారు పొరపాటు జరిగిందని బదులిచ్చారు. దాంతో వారి తరఫున తాను క్షమాపణలు కోరుతున్నట్లు.. బాధితురాలికి పలు పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
‘సార్! మాకు పొలం లేకపోయినా ఉన్నదంటూ రైతు భరోసా కింద రూ.40,500 ఇచ్చామని చూపించారు. అందులో కాసిన మామిడికాయే ఇది..’ అని ఆమె పేర్కొన్నారు. ‘ నా పేరుతో ఇచ్చిన పుస్తకంలో.. జగనన్న వసతి దీవెన రూ.1,600, విద్యాదీవెన రూ.17,500లు, వైఎస్‌ఆర్ రైతు భరోసా రూ.40,500లతో కలిపి మొత్తంగా రూ.59,600 లబ్ధి చేకూరినట్లు ముద్రించారు. రేషన్‌కార్డు, విద్యాదీవెన, నా భర్తకు చేనేత పింఛను అన్నీ తీసివేశారు..’ అని ఆమె వివరించారు.
నివ్వెరపోయిన ఎమ్మెల్యే ముస్తాఫా సచివాలయ సిబ్బందిని ప్రశ్నించగా.. వారు పొరపాటు జరిగిందని బదులిచ్చారు. దాంతో వారి తరఫున తాను క్షమాపణలు కోరుతున్నానని, అర్హత కలిగిన పథకాలు అందేలా చూస్తానని సుబ్రమణ్యేశ్వరికి ఆయన హామీ ఇచ్చారు.