పార్ట్ టైం జాబ్ నుంచి ప్రధాని పీఠం దాకా!
ఓ దేశానికి 34 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి కావడం మామూలు విషయం కాదు. అదీ ఒక మహిళ... కానీ సనా మారిన్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారామె. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ వైరస్‌ను కట్టడి చేసిన అతి కొద్ది మంది దేశాధినేతల్లో సనామారిన్ కూడా ఒకరు. ఇప్పటివరకు (ఆగస్టు 4) అక్కడ కేవలం 7,466 కరోనా కేసులు నమోదు కాగా, 329 మంది చనిపోయారు. కరోనా కేసులు రాగానే దేశంలో ఆరోగ్య అత్యయిక స్థితిని విధించిన ఆమె... తన ముందుచూపుతో ఈ మహమ్మారిని పూర్తిగా కట్టడి చేశారు. ఇక తమ దేశ పౌరుల కోసం ‘వారానికి నాలుగు రోజులు, రోజుకి ఆరు గంటలే పని’ అనే నిబంధనను అమలు చేసి ప్రపంచ వ్యాప్తంగా పనిగంటలపై చర్చించుకునేలా చేశారీ సూపర్ వుమన్. ప్రజలు తమ కుటుంబం, పిల్లలతో ఎక్కువ సేపు గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అప్పట్లో చెప్పుకొచ్చారు సనా మారిన్.
16 ఏళ్ల ప్రేమబంధం !
ఇలా తన పాలనా దక్షతతో ప్రపంచ దేశాధినేతల ప్రశంసలు అందుకుంటున్న ఆమె ఎంతో నిరాడంబరంగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు మార్కస్ రయిక్కొనెన్ తో కలిసి పెళ్లి పీటలెక్కారీ యంగ్ ప్రైం మినిస్టర్. సుమారు పదహారేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ స్వీట్ కపుల్‌కి ఎమ్మా అమైలా మారిన్ అనే రెండున్నరేళ్ల కూతురు కూడా ఉంది. ఫిన్‌ల్యాండ్ రాజధాని హెల్సింకిలోని ప్రధాని అధికారిక నివాసంలో అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు కేవలం 40 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఇక పెళ్లి వేడుకలో ఫ్యాషనబుల్ దుస్తులు ధరించి మురిసిపోయారీ లవ్లీ కపుల్. వధువు సనా మారిన్ పొడవాటి తెలుపు రంగు గౌన్‌లో ఏంజెల్‌లాగా మెరిసిపోగా, వరుడు మార్కస్ క్లాసిక్ టక్సిడో సూట్‌లో సూపర్బ్ అనిపించాడు.