తెలంగాణ

telangana

ETV Bharat / city

'టిండర్‌' ఎఫెక్ట్‌: స్నేహం పేరుతో మోసం చేసిన హైటెక్‌ కిలాడి - టిండర్ మోసం

సామాజిక మాధ్యమాలు... కొత్త నేరాలకు పురిగొల్పుతున్నాయి. స్నేహం పేరుతో దగ్గరవ్వాలనే కోరిక కొందరిది... అదే స్నేహం ముసుగులో మోసం చేయాలనే కుట్ర మరికొందరిది. ఇక్కడ బాధితులు ఆడవాళ్లు, నిందితులు మగవాళ్లు కానక్కర్లేదు. ఎవరు ఏదైనా కావచ్చు. మహిళలు సైతం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా అడ్డదార్లు తొక్కుతున్నారు. ఆ కోవకు చెందిన నిందితురాలే మహేశ్వరి. మరి ఆమె ఎవరిని ఎలా మోసం చేసిందో ఈ హైటెక్‌ స్టోరీ చదివేయండి.

woman illicit friendship with man in tinder app at hyderabad
'టిండర్‌' ఎఫెక్ట్‌: స్నేహం పేరుతో మోసం చేసిన హైటెక్‌ కిలాడి

By

Published : Feb 19, 2020, 9:33 PM IST

'టిండర్‌'... ఈ డేటింగ్‌ యాప్ తెలియని యువత ఉండరు. దానికున్న క్రేజే అందుకు కారణం. హైదరాబాద్‌, మాదాపూర్‌నకు చెందిన బాధితుడు మణికంఠ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నాడు. నచ్చిన అమ్మాయి ఫోటోలు కనపడ్డవాటికల్లా లైక్‌ కొట్టాడు. ఒక్కరైనా తిరిగి లైక్ చేయకపోతారా అనుకున్నాడు. అక్కడే తగిలింది... ఆ అమ్మాయి మహేశ్వరి. ఇంజినీరింగ్‌ పూర్తి చేశానని చెప్పి వలలో వేసుకుంది. మణికంఠతో పరిచయం కాస్త ఫోన్లను దాటి హోటల్‌ రూమ్‌లోని వెళ్లే వరకు దారితీసాయి. అక్కడ శారీరకంగా కలిసిన దృశ్యాలను కెమెరాలో బంధించింది మహేశ్వరి. ఆమె తన స్నేహితుడైన సంతోష్‌తో కలిసి కూకట్‌పల్లి పోలీసులమని బ్లాక్‌మెయిల్‌ చేసింది. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడు మణికంఠ నుంచి రూ.4,49,000/-, ఐఫోన్‌ను లాగేసుకున్నారు. ఇంకా లక్షన్నర రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కూకట్‌పల్లి పోలీసులు పథకం ప్రకారం మణికంఠతో వారికి డబ్బులిస్తామని ఫోన్‌ చేయించారు. డిసెంబర్‌ 26న పోలీసులు ఫోరం మాల్‌ వద్ద వారికి అదుపులోకి తీసుకుని దాదాపు రూ.4లక్షలు రికవరీ చేశారు. రిమాండ్‌కు తరలించారు.

నిందితులు మహేశ్వరి, సంతోష్‌

అనంతరం జనవరిలో విడుదలైన నేరస్తురాలు మహేశ్వరి... సామాజిక మాధ్యమాల్లో పోలీసులపై పలు వ్యాఖ్యలు చేసింది. స్పందించిన పోలీసులు ఆమె ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మహేశ్వరి చేతిలో మోసపోయిన వారు మరెందరో బాధితులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెను మరోసారి న్యాయస్థానంలో ప్రవేశపెడతామని తెలిపారు.

భర్తపై కేసుపెట్టి వదిలేసింది....

ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు చెందిన మహేశ్వరి పదో తరగతి మాత్రమే చదువుకుంది. ప్రస్తుతం కేపీహెచ్‌బీ కాలనీ వసంత్‌నగర్‌లో తండ్రి వద్ద నివాసముంటోంది. కట్టుకున్న భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి పిల్లలకు, భర్తకు దూరంగా ఉంటోంది. అక్రమంగా డబ్బులు సంపాదించాలన్న ఆశే ఆమెను అడ్డదార్లు తొక్కేలా చేసింది. అమ్మాయిలతో స్నేహం చేయాలన్న అబ్బాయిలే ఆమెకు పావులుగా మారుతున్నారు. జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details