9 నెలల గర్భిణిగానే ఆమె సర్పంచి అభ్యర్థిగా బరిలో నిలిచింది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించింది. సరిగ్గా పోలింగ్ రోజు ఓటు వేశాక నొప్పులు రావటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా కోరుకల్లులో చోటుచేసుకుంది.
కూతురు పుట్టిన వేళ.. పదవొచ్చిన వేళ! - పోలింగ్ రోజు బిడ్డకు జన్మనిచ్చి సర్పంచ్‌గా గెలిచిన మహిళ తాజా వార్తలు
ఆ ఇంట పుట్టిన మహాలక్ష్మి.. తల్లికి సర్పంచ్ పదవి తెచ్చిపెట్టిందని సంబరపడుతున్నారు ఏపీలోని కృష్ణ జిల్లా కలిదింది మండలం కోరుకల్లు గ్రామ సర్పంచ్‌గా గెలిచిన లీలాకనకదుర్గ. పోలింగ్ రోజే పండంటి ఆడపిల్లకు జన్మనివ్వటం... అనంతరం సర్పంచ్‌గా గెలవటం.. అంతా బిడ్డొచ్చిన వేళావిశేషం అంటూ ఆ తల్లి మురిసిపోతోంది.
రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో కలిదిండి మండలం కోరుకల్లులో సర్పంచి స్థానం మహిళకు రిజర్వు అయ్యింది. బట్టు లీలాకనకదుర్గ సర్పంచి అభ్యర్థిగా బరిలో నిలిచారు. అప్పటికే ఆమె 9 నెలల గర్భిణి. కడుపులో బిడ్డనుమోస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శనివారం పోలింగ్ రోజున ఓటు వేసిన తర్వాత ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చారు. బిడ్డొచ్చిన వేళా విశేషమమో ఏమో కానీ అర్ధరాత్రి వెలువడిన ఫలితాల్లో ప్రత్యర్థులపై 689ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. సర్పంచ్ పదవి తన బిడ్డ తెచ్చిన అదృష్టమేనంటూ సంబరపడిపోతున్నారు.
జీవితాంతం గుర్తుండిపోతుంది..
తనకు సర్పంచ్ పదవీ దక్కటం తన బిడ్డ తెచ్చిన ఆదృష్టమేనని తల్లి మురిసిపోతుంది. రాజకీయాల్లోకి వస్తానని ఏమాత్రం ఊహించని తనకి.. ఏకంగా సర్పంచ్ పదవి రావటం ఆశ్చర్యంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటన తనకు జీవితాంతం గుర్తుండి పోతుందని లీలా కనకదుర్గ చెబుతోంది.