Velerupadu: ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా వేలేరుపాడుకు చెందిన ఎర్రా వనజాకుమారి అనే మహిళ తన గోడును వీడియో ద్వారా వెల్లబోసుకున్నారు. ఏం చెప్పారంటే..
‘ఇటీవల వచ్చిన వరదలకు మా ఇల్లు ముంపునకు గురికావడంతో కుటుంబ సభ్యులతో సహా మండలంలోని శివకాశీపురం పునరావాస కేంద్రంలో తలదాచుకున్నాం. గత నెల 28న వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి మా బాధ చెప్పుకున్నాం. ఇందుకు కక్షగట్టారు.. వరదలో మునిగిపోయిన మా ఇళ్లు ఇంకా ఘోరంగా ఉన్నాయి. అయినా మాపై నిన్నటి నుంచి ఒత్తిడి తెచ్చి పునరావాస కేంద్రాన్ని ఖాళీ చేయించారు. ఖాళీ చేసేవరకు ఊరు కోలేదు. నిన్నటి నుంచి భోజనం పెట్టడం లేదు. పునరావాస కేంద్రంలో ఉండనివ్వండి చాలు... మా భోజనం మేమే వండుకుంటామన్నా వినలేదు. ఇల్లు బాగు చేసుకున్నాక వెళతామన్నా వినకుండా పట్టుబట్టి గెంటేశారు. కనీసం రెండు రోజులు గడువు అడిగినా ఇవ్వలేదు. మా వీడియోలు, ఫొటోలు తీసి వాట్సాప్లో పెట్టారు. ఎమ్మార్వో పంపారంటూ వీఆర్వో రాంబాబు వచ్చారు. కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని.. ఖాళీ చేసి మీ ఇళ్లకు పోండని చెప్పారు. ఇళ్లకు వెళ్లలేకపోతే ఎక్కడైనా బరకాలు వేసుకుని ఉండండి, ఇక్కడ మాత్రం వద్దని చెప్పారు. చంద్రబాబు వచ్చినప్పుడు మా బాధలు చెప్పాను. పిల్లల చదువు కోసం పక్క ఊరికి మకాం వెళ్లామని చెప్పి, పునరావాస ప్యాకేజీలో మా పేరు తీసేశారని గోడు వెళ్లబోసుకున్నాను. అందుకే కక్షగట్టి మమ్మల్ని వెళ్లగొట్టారు.’ అని వనజాకుమారి ఆ వీడియోలో ఆవేదన వ్యక్తంచేశారు.