Wife Complaint on Husband : పెద్దలు కుదిర్చిన వివాహం. భార్యాభర్తలిద్దరూ అమెరికాలోని ఐటీ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారు. ఇటీవల భార్య తిరిగొచ్చి భర్తపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25 ఏళ్ల దాంపత్య జీవితం తరువాత ఆమె భర్తపై ఫిర్యాదు చేయటం చర్చనీయాంశమైంది. పెళ్లయిన మొదటి రోజు నుంచి భర్త ద్వారా ఎదురైన మనోవేదన మౌనంగా భరించింది. పిల్లలు పుట్టాక అలవాటుగా మార్చుకుంది. ఇద్దరు బిడ్డలు ఉన్నత చదువులు పూర్తిచేసి.. పెళ్లిళ్లు చేశాక.. అప్పటి వరకూ అనుభవించిన నరకం నుంచి బయటపడాలనే నిర్ణయానికి వచ్చింది.
'నీతో కాపురం నా వల్ల కాదు'.. 25 ఏళ్ల తర్వాత భర్తపై ఫిర్యాదు
Wife Complaint on Husband : ఎన్నో ఆశలతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది ఆ అమ్మాయి. ఇద్దరికీ అమెరికాలో ఐటీ కంపెనీల్లో ఉన్నత హోదాలో ఉద్యోగం. వృత్తిపరంగా ఆమెకు ఎనలేని గౌరవం. ఆమెను ఆదర్శంగా తీసుకున్న వారెందరో. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఆమె జీవితం దుర్భరం. పెళ్లైన మొదటి రోజు నుంచి భర్త ద్వారా మనోవేదన ఎదురైంది. మొదట్లో చాలా బాధగా అనిపించినా నెమ్మదిగా అలవాటు పడిపోయింది. పిల్లలు పుట్టాక వారి కోసమని ఆ వేదనను మౌనంగా భరించింది. పిల్లలు పెద్దవాళ్లయి.. వారి పెళ్లిళ్లు అయ్యాక.. ఇక తన శేష జీవితమైనా హాయిగా బతకాలనుకుంది. భర్త మనోవేదనకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంది. అంతే అమెరికా నుంచి హైదరాబాద్ వాలిపోయింది. 25 ఏళ్లుగా భర్త మానసికంగా పెట్టిన హింసను పోలీసుల వద్ద వెల్లబోసుకుంది. చిత్రమేంటంటే.. తాను భార్యను అంతగా బాధ పెట్టిన విషయం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు ఆ వ్యక్తికి తెలియలేదు.
కేసు నమోదు చేసిన పోలీసులు ఆలుమగలిద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. అప్పటికి కానీ భర్తకు తాను భార్యను హింసించానని తెలుసుకోలేకపోయారు. తనపై భార్య ఫిర్యాదు చేయడాన్ని నమ్మలేకపోయారు. ఒక్కఛాన్స్ ఇస్తే మారతానంటూ జీవిత భాగస్వామిని వేడుకున్నారు. ఆమె ఇక భరించలేను.. ఒంటరిగానే ఉంటానంటూ తెగేసి చెప్పారు.
ఉన్నత హోదాలో పనిచేసే బాధితురాలు.. అప్పటి వరకూ ఎంతగా నలిగిపోయారనేది ఆమె మాటల్లో గుర్తించానని సైబరాబాద్‌కు చెందిన పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పిల్లలు ప్రయోజకులయ్యేంత వరకూ వేచిచూసి చివరకు ఫిర్యాదు చేశారని వివరించారు. సమాజంలో చాలా మంది మహిళల పరిస్థితి ఇలాగే ఉందని.. కానీ పిల్లల కోసం ఇలా వేదన అనుభవిస్తూనే కాలం వెళ్లదీస్తున్నారని చెప్పారు. కొందరు బాధ తట్టుకోలేక మధ్యలోనే ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకుంటున్నారని అన్నారు. ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ముందుగా పెద్దలకు చెప్పాలని.. వారు కూడా పట్టించుకోకపోతే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు. ఇలా ఏళ్ల తరబడి మగ్గిపోయి జీవితాలను నరకం చేసుకోవద్దని కోరారు.