తెలంగాణ

telangana

ETV Bharat / city

మృగశిరకార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..? - Mrigasira Karte special story

Mrigasira Karte 2022 : ఇవాళ తెలంగాణలో ఏ ఇంట చూసినా చేపల కూర వాసనే కమ్మగా వస్తుంది. ఈరోజు ఏం తిన్నారని ఎవర్ని అడిగినా చేపల కూర అనే చెబుతారు. అసలు ఈరోజు స్పెషాలిటీ ఏంటి..? ఎందుకు అందరు చేపల కూరే తింటారు అనుకుంటున్నారా. ఇవాళే మృగశిక కార్తె ప్రారంభం అయింది. ప్రతి ఏటా మృగశిర కార్తె మొదలవగానే చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. అసలు చేపలకు ఈ కార్తెకు ఉన్న సంబంధమేంటి అనేగా మీ సందేహం. మరెందుకు ఆలస్యం. ఈ స్టోరీ చదివేయండి..

Mrigasira Karte 2022
Mrigasira Karte 2022

By

Published : Jun 8, 2022, 11:09 AM IST

Mrigasira Karte 2022 : మృగశిర కార్తె వచ్చేసింది. రోళ్లు పగిలే ఎండతో రోహిణికార్తెలో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు ఇప్పుడు తొలకరిజల్లుల్లో తడవడానికి సిద్ధమయ్యారు. గ్రీష్మతాపంతో ఇన్నాళ్లూ అల్లాడిన జనం చిరుజల్లుల హాయిలో సాంత్వన పొందడానికి రెడీగా ఉన్నారు. ఇక వేసవితాపం నుంచి ఒక్కసారిగా వానాకాలం షురూ కావడంతో శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. రోధనిరోధక శక్తి తగ్గి ప్రజలు అనారోగ్యం బారిన పడతారు. ఈ సీజన్‌లో జీర్ణశక్తి కూడా తగ్గిపోతుంది. శరీరంలో ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసి ఇమ్యూనిటీని పెంచడానికి చేపలు దోహదపడతాయి. అందుకే మృగశిర కార్తె మొదలవగానే చేపలు తింటారు. చేపలు తినని వారు ఇంగువలో బెల్లం కలుపుకుని తింటారు.

చేపల్లో ఎన్ని పోషకాలో..చేపల్లో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజ పోషకాలు లభిస్తాయి. మానవునికి కావాల్సిన అతి ముఖ్యమైన రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్, ఐసాల్యూసిన్ వంటి ఆమ్లోనో ఆమ్లాలు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. థయామిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, పెరిడాక్సిన్‌, బయోటిన్‌, పెంటోదినిక్‌ ఆమ్లం, బీ 12 వంటి విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ , ఈపీఏ వంటివి కంటి చూపునకు పనిచేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చేపల్లో ఉన్న కొవ్వులు (కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిసరైడ్స్‌) శరీర రక్త పీడనంపై (అంతిమంగా గుండెపై) మంచి ప్రభావం చూపుతాయి. గుండె జబ్బు, అస్తమా వ్యాధిగ్రస్తులు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే చాలా మంచిది.

మార్కెట్లు కిటకిట..మృగశిరకార్తె షురూ అవడంతో రాష్ట్రంలోని చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. ఇవాళ చేపలు తినడం ఆనవాయితీగా వస్తుండటంతో ప్రజలంతా చేపలు కొనడానికి మార్కెట్ల బాట పట్టారు. రెండింతలు ధర ఉన్నా.. చేపలు కొనకుండా ఎవరూ వెనుతిరగడం లేదు. ఇవాళ చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుందనే నమ్మకమే వారిని మార్కెట్లలో బారులు తీరేలా చేస్తోంది.

రెండు రెట్ల ధరలు..ముఖ్యంగా హైదరాబాద్‌లోని చేపల మార్కెట్లన్నీ వినియోగదారులతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ముషీరాబాద్‌ మార్కెట్‌లో తెల్లవారుజాము నుంచే ప్రజలు చేపల కొనుగోలుకు క్యూ కట్టారు. సాధారణ రోజుల కన్నా ఈరోజు అన్ని రకాల చేపల ధరలు విపరీతంగా ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో కొర్రమీను కిలో మూడు వందల రూపాయల నుంచి రూ.400 లోపు అమ్మకం జరగ్గా.... మృగశిర సందర్భంగా డిమాండ్ ఉన్న కొర్రమీను కిలో రూ.400, రూ.500, రూ.600 కేజీ చొప్పున అమ్మకాలు జరిగాయని వ్యాపారులు తెలిపారు.

టన్నుల్లో చేపల అమ్మకాలు.. మృగశిర కార్తె రోజు తెలంగాణలో ఎక్కువగా కొర్రమీను, మత్త గురిజనలు వంటి చేపలు తినడం ఆనవాయితీ. అందుకే ఇవాళ ఈ చేపలకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. మృగశిర కార్తె సందర్భంగా.. మూడు నాలుగు రోజులుగా పొరుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి వందలాది లారీల్లో అనేక రకాల చేపలు తీసుకువచ్చారు. ఇవాళ తెల్లవారుజామున మూడు గంటలకు విశాఖపట్నం, అనంతపురం, తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు వందలాది టన్నుల చేపలు దిగుమతి అయ్యాయి. ఉదయం 6 గంటల వరకు 400కు పైగా టన్నుల చేపల అమ్మకాలు జరిగాయని వ్యాపారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details