Children's IQ Power:సమస్య: నాకు ఇద్దరు పిల్లలు. చిన్న బాబుకు 14 ఏళ్లు. 9వ తరగతి చదువుతున్నాడు. చదువులో వెనకబడ్డాడు. కాస్త అయోమయంగా ఉన్నట్టు కనిపిస్తాడు. ప్రవర్తన, పని చేసే తీరు నిదానంగా ఉంటుంది. మూడేళ్ల క్రితం మెదడు ఎంఆర్‌ఐ పరీక్ష చేయించాం. ఏమీ సమస్య లేదన్నారు. కానీ నిద్రలో పళ్లు కొరుకుతాడు. పడుకున్న వెంటనే నిద్రపోతాడు. అవసరమైనప్పుడు మధ్యలో ఎంత లేపినా లేవడు. మాది మేనరిక వివాహం. పెళ్లయ్యాక మూడేళ్లకు నా భర్తకు మూర్ఛ మొదలైంది. ఆయన ఇటీవలే మరణించారు. బతికి ఉన్నంతకాలం మందులు వాడారు. దాని వల్ల ఇంకా ఎక్కువగా భయపడుతున్నాము. దయచేసి మా పిల్లాడి సమస్యకు పరిష్కారం తెలపగలరు.
- మాధవి పి. (ఈమెయిల్)
సలహా: పుట్టినప్పుడు పిల్లాడు వెంటనే ఏడ్చాడా? ఏదైనా ప్రత్యేక చికిత్స అవసరమైందా? తొలి సంవత్సరాల్లో మాట, నడక సమయానికి వచ్చాయా? బడిలో చేర్పించాక చదువు త్వరగా అబ్బిందా? లేదా? వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీ బాబును విశ్లేషించాల్సి ఉంటుంది. ఐక్యూ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. దీని ద్వారా వయసు ప్రకారం మెదడు ఎదిగిందా? లేదా? అనేది బయటపడుతుంది. ఐక్యూ తక్కువుంటే తమ వయసు పిల్లలతో కలవలేకపోవచ్చు. చదివింది అర్థం కాకపోవచ్చు. చదువులో వెనకబడిపోవచ్చు. ఫలితంగా అయోమయంగా ఉన్నట్టు ప్రవర్తించొచ్చు. మీరు మెదడు స్కాన్ చేయించామని, సమస్యలేవీ లేవని అంటున్నారు. మరీ పెద్ద సమస్యలుంటే తప్ప ఇందులో ఐక్యూ ఎలా ఉందనేది తెలియదు. ఐక్యూ పరీక్షతోనే ఎదుగుదలలో ఇబ్బందులుంటే బయటపడతాయి.