తెలంగాణ

telangana

ETV Bharat / city

Global Center For Traditional Medicine : హైదరాబాద్​లో అంతర్జాతీయ సంప్రదాయ వైద్యకేంద్రం

Global Center For Traditional Medicine : భాగ్యనగర కిరీటంలో మరో కలికితురాయి చేరనుంది. మరో ప్రతిష్ఠాత్మక వైద్యసంస్థకు ఈ మహానగరం వేదిక కాబోతోంది. అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని హైదరాబాద్​లో నెలకొల్పడానికి డబ్ల్యూహెచ్​ఓ ముందుకొచ్చింది. ప్రధాని కార్యాలయం నుంచి ప్రతిపాదన రావడంతో స్థల సేకరణకు రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తోంది.

Global Center For Traditional Medicine
Global Center For Traditional Medicine

By

Published : Feb 16, 2022, 8:22 AM IST

Global Center For Traditional Medicine : మరో ప్రతిష్ఠాత్మక వైద్యసంస్థకు హైదరాబాద్‌ వేదిక కాబోతోంది. అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రాన్ని (గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌) హైదరాబాద్‌లో నెలకొల్పడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రతిపాదన రావడంతో ఇందుకు అవసరమైన సుమారు 40-50 ఎకరాల స్థల సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిపై ఆయుష్‌ కమిషనర్‌ అలుగు వర్షిణి కూడా సంబంధిత వివరాలను పేర్కొంటూ, ఇటీవల వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీకి లేఖ రాశారు. అంతర్జాతీయ సంప్రదాయ వైద్యకేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థే నిర్మిస్తుంది. అనంతరం నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకుంటుంది. కొవిడ్‌ పరిణామాల్లో రాష్ట్రానికి ఇంతటి ప్రతిష్ఠాత్మక సంస్థ రానుండడం ఆహ్వానించదగిన పరిణామమని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.

ప్రధానితో ఎంపీల సమావేశంలో చర్చ

Global Center For Traditional Medicine in Hyderabad : కొద్ది రోజుల కిందట అన్ని రాష్ట్రాల ఎంపీలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. కొవిడ్‌ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యం ఏర్పడిందని ప్రధాని ఆ సమావేశంలో తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌లో అంతర్జాతీయస్థాయి సంప్రదాయ వైద్య కేంద్రాన్ని స్థాపించేందుకు ఆసక్తి చూపిస్తోందని ఆయన చెప్పారు. ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనే చర్చ జరగ్గా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలో ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకమైన సీసీఎంబీ, సీఎస్‌ఐఆర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఐఐటీ హైదరాబాద్‌, డీఆర్‌డీవో తదితర సంస్థలున్నాయని గుర్తుచేశారు. అందువల్ల అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రంలో పరిశోధనలకు ఎటువంటి ఇబ్బందులు ఉండబోవని కిషన్‌రెడ్డి వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ ఆ మేరకు ఆదేశాలు జారీచేశారు. ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం నుంచి దీనికి సంబంధించిన ప్రతిపాదిత లేఖ అధికారికంగా రాష్ట్రానికి చేరింది.

ఐడీపీఎల్‌ స్థలంలో ఏర్పాటు !

సంప్రదాయ వైద్య కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలంలోని హిమాయత్‌సాగర్‌ గ్రామంలో నెలకొల్పాలని తొలుత ప్రతిపాదించారు. కానీ ఆ స్థలాన్ని ఇప్పటికే ‘బయోసిన్‌ మెడికల్‌ బొటానికల్‌ పార్క్‌’కు కేటాయించడంతో ఆ యోచన వాయిదా పడింది. తాజాగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కొత్త ప్రతిపాదన చేశారు. హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ఐడీపీఎల్‌ స్థలం అంతర్జాతీయ సంప్రదాయ వైద్య కేంద్రానికి అనుకూలంగా ఉందని ఆయన సూచించారు. ఈ అంశాలన్నింటినీ ఆయుష్‌ కమిషనర్‌ తన లేఖలో పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details