రాష్ట్రంలో కమలదళపతి ఎవరన్నది ఆసక్తిగా మారింది. భాజపా రాష్ట్రబాధ్యుడు కృష్ణదాస్ జరిపిన తొలివిడత అభిప్రాయ సేకరణలో రాష్ట్రనేతలు ఎక్కువ మంది ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ వైపు మొగ్గు చూపారు. రెండో దఫాలో మాత్రం నాయకత్వ మార్పు జరగాలని కొందరు సూచించినట్లు తెలిసింది. ఇటీవల దిల్లీకి వెళ్లిన లక్ష్మణ్.. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాలను కలిసి వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడిగా తన మూడేళ్ల పనితీరుతోపాటు.. సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ దక్కని విషయాన్ని నడ్డాకు వివరించినట్లు తెలిసింది. సామాజికవర్గం, సీనియారిటీ వంటి అంశాలూ కలిసివస్తాయని.. పగ్గాలు తనకే దక్కుతాయని లక్ష్మణ్ ధీమాతో ఉన్నారు.
డీకే అరుణ.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. జితేందర్‌రెడ్డి ఇప్పటికే అమిత్‌షా, నడ్డాలను కలిసి తన బయోడేటాను అందించారు. బలమైన సామాజికవర్గం, కొంతకాలం మినహా భాజపాతో సుదీర్ఘ అనుబంధం తదితర అంశాలను ఆయన జాతీయ నాయకత్వానికి వివరించినట్లు తెలిసింది. జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేరును సైతం కేంద్ర నాయకత్వం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లక్ష్మణ్, మురళీధర్‌రావు, డీకే అరుణ, జితేందర్‌రెడ్డిలలో ఎవరికి తెలంగాణ కమలదళం పగ్గాలు దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఆశావహులు ఎక్కువే..