ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రధాన నిందితుడిగా (ఏ1) ఉన్న ఫోర్జరీ, మోసం, తప్పుడుపత్రాల సృష్టి కేసులో పరిణామాలన్నీ తొలి నుంచి సంచలనంగానే ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కేసును ఉపసంహరించుకునేందుకు వీలుగా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు విచారణ కీలకదశకు చేరుకుంటున్న తరుణంలో ఈ కేసుకు సంబంధించిన ముఖ్యమైన దస్త్రాలు, పత్రాలు, ఆధారాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలు ఏకంగా న్యాయస్థానం నుంచే చోరీకావటం రాష్ట్రంలో సంచలనమైంది.
మంత్రి నిందితుడిగా ఉన్న కేసులో కీలకపత్రాలు, ఆధారాల్ని న్యాయస్థానంలో తాళాలు పగలకొట్టి మరీ దొంగలు ఎత్తుకుపోవటంపై అంతటా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. బిహార్‌లో అరాచక పాలన జరిగినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు లేవని, అలాంటి దారుణాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకోవటం అత్యంత ప్రమాదకరమని ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయస్థానాలకే భద్రత లేకపోతే ఏ కేసులో నిందితులైనా ఇదే తరహాలో ఆధారాల్ని, పత్రాల్ని చోరీ చేసుకుంటూ వెళ్లిపోయే పరిస్థితులు దాపురిస్తాయేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నా.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మంత్రి గోవర్ధన్‌రెడ్డి కానీ, హోం మంత్రి తానేటి వనిత స్పందించలేదు. ప్రభుత్వం, డీజీపీ వైపు నుంచీ ఎలాంటి ప్రకటన లేదు. నెల్లూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో దొంగతనం జరిగి మూడు రోజులవుతున్నా ఈ కేసులో ఇప్పటివరకూ పురోగతి లేదు.
నేర నిరూపణ అయితే ఏడేళ్లు జైలుశిక్ష...
ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి 2016 డిసెంబర్ 23న అప్పటి వ్యవసాయ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై విలేకర్ల సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. సోమిరెడ్డికి మలేషియాలో భూములు, థాయ్‌లాండ్‌లో విద్యుత్తు ప్రాజెక్టుతో పాటు ఆయన కుటుంబీకుల పేరిట సింగపూర్, హాంకాంగ్‌లోని బ్యాంకుల్లో మిలియన్ డాలర్ల సొమ్ము ఉందని ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలంటూ కొన్ని డాక్యుమెంట్లు, పత్రాలు చూపించారు.
ఆస్తుల్ని చూసుకునేందుకు సోమిరెడ్డి 2003 సెప్టెంబరు 13న మలేషియా వెళ్లారంటూ కొన్ని పత్రాల్ని చూపించి వాటి ప్రతులూ అందించారు. అవన్నీ ఫోర్జరీ పత్రాలు, తప్పుడు డాక్యుమెంట్లు అంటూ 2016 డిసెంబరు 28న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు గ్రామీణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 120 (బి), 468, 469, 471, 506లతో పాటు ఐటీ చట్టంలోని 65, 71 సెక్షన్ల ప్రకారం కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు ప్రధాన నిందితుడైన కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై ఫోర్జరీ, అంతర్జాతీయ డాక్యుమెంట్ల ఫ్యాబ్రికేషన్, విదేశీ బ్యాంకు ఖాతాల ప్రతులు, ఇమ్మిగ్రేషన్ ఎంట్రీల ప్రతుల ఫ్యాబ్రికేషన్, నకిలీ పాస్‌పోర్టు సృష్టి తదితర అభియోగాలు మోపుతూ నెల్లూరు నాలుగో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసులో కాకాణి నేరం చేసినట్లు నిరూపణయితే ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.