తెలంగాణ

telangana

ETV Bharat / city

Antarctica: అంటార్కిటికా అందాలను చూడటానికి రెండు కళ్లూ చాలవు...! - hyderabad district news

చైనా, భారత్‌ కలిస్తే ఎంత పెద్ద భూభాగం అవుతుందో... అంత పెద్దగా ఉంటుంది అంటార్కిటికా! జనాభా మాత్రం వెయ్యికి మించదు. 99 శాతం మంచుతో కప్పి ఉండటం... ఉష్ణోగ్రత -86 డిగ్రీలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితేనేం, అక్కడి మంచుకొండల అందాలనీ, పెంగ్విన్‌లనీ, మంచు ఎడారి ఒయాసిస్సుల్నీ చూడటానికి రెండు కళ్లూ చాలవు! ఈ అవకాశాన్ని ఇప్పుడు పర్యటకులకి అందిస్తోంది ఓ సంస్థ...

Antarctica
Antarctica

By

Published : Oct 19, 2021, 8:23 AM IST

ప్రపంచ నలుమూలల నుంచి అంటార్కిటికాకి పర్యటనలకు వెళ్లడం కొత్త విషయమేం కాదు. గత 70 ఏళ్లుగా ఎన్నో సంస్థలు వీటిని నిర్వహిస్తున్నాయి. కానీ, అవన్నీ ఈ దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని దూరం నుంచి మాత్రమే చూపిస్తాయి. దక్షిణ అమెరికాలోని పెరూ, చిలీ వంటి దేశాల నుంచి ఓడల్లో తీసుకెళ్లి, అంటార్కిటికా అంచుల్లోని తీరంలో కాసేపు తిప్పి వెనక్కి తీసుకొస్తాయి. కానీ లండన్‌కి చెందిన ‘వైట్‌ డెజర్ట్‌’ అనే సంస్థ ఇప్పటిదాకా సైంటిస్టులకి తప్ప సామాన్యుల పాదం పడని చోట్లని సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా విమానాలే కాదు... అక్కడ ఒక హోటల్‌నీ ఏర్పాటుచేసింది.

మూణ్ణెల్ల’ ముచ్చట...

అంటార్కిటికాలో మనకున్నట్టు పగలూ రాత్రీ ప్రతిరోజూ ఉండవు! ఏడాదిలో తొమ్మిది నెలలు ఇక్కడ సూర్యుడే కనిపించడు.. పగలైనా రాత్రయినా చీకటి మాత్రమే ఉంటుంది. అది ఇక్కడ చలికాలం. ఇక డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చీకటి అనేదే ఉండదు... 24 గంటలూ వెలుగే ఉంటుంది. అదే ఇక్కడి వేసవి. ఈ మూణ్ణెల్ల వేసవిలోనే పర్యటనలు నిర్వహిస్తుంటారు. ఆ కాలంలోనే పెంగ్విన్‌లూ, సీల్‌లాంటివి సముద్రం నుంచి నేలమీది కొస్తాయి. ప్రపంచంలోని ఈ అతిపెద్ద మంచు ఎడారిలో అప్పుడే స్వచ్ఛమైన నీటి ఒయాసిస్సులు ఏర్పడతాయి. ఈ ఒయాసిస్సుల పక్కనే ప్రపంచ దేశాలన్నీ తమ పరిశోధనా కేంద్రాల్ని నిర్వహిస్తుంటాయి. భారతదేశం కూడా ‘షిర్‌మేకర్‌’ అనే అతిపెద్ద ఒయాసిస్సు పక్కన ‘మైత్రి’ అనే పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ కేంద్రానికి దగ్గర్లోనే ‘విచావే’ అనే క్యాంప్‌ని ఏర్పాటుచేసి... అక్కడ అంటార్కిటికాలోనే తొలి హోటల్‌ని నిర్మించింది వైట్‌ డెజర్ట్‌ సంస్థ. ఈ హోటల్‌లో కృత్రిమ వెచ్చదనం కల్పించే ‘పాడ్‌’లు ఉంటాయి. ఇక్కడ పులావ్‌ నుంచి సాల్మన్‌ చేపల ఫ్రై దాకా ప్రతిదీ ఏర్పాటుచేస్తోంది వైట్‌ డెజర్ట్‌. పర్యటనతో అలసిపోయిన వాళ్లని యోగాతోనూ సేదదీరుస్తారు. ఈ వసతులన్నీ ఒక ఎత్తైతే... అంటార్కిటికా ఖండం మారుమూలలకి విమానాలూ, హెలికాప్టర్‌ల ద్వారా పర్యటకులని తీసుకెళ్లడం ఒక ఎత్తు. మన ప్రాంతాల్లోలాగా అంటార్కిటికాలో తారుతోనో కంకర రాళ్లతోనో రోడ్లు వేయలేం... అసలు బయటి దేశాల నుంచి వీటిని ఇక్కడికి తీసుకురావడం కూడా నిషేధమే! అందుకనే, మామూలు మంచు నేలనే ఎప్పటికప్పుడు చదునుచేస్తూ ‘రన్‌ వే’లు నిర్మిస్తారు. ప్రతి ఫ్లైట్‌కీ ఇలా చేస్తూనే ఉంటారు. ‘వూల్ఫ్‌ ఫ్యాంగ్‌’ పేరుతో తనకంటూ ఇలాంటి సొంత రన్‌వేని నిర్మించుకుంది ‘వైట్‌ డెజర్ట్‌’ సంస్థ. ‘ఏడాదిలో మూణ్ణెల్లు తప్ప పర్యటకులు రాని ఇక్కడికి సొంత రన్‌వేలూ, విమానాలూ, హోటళ్లు. ఇంత ఖర్చూ ఎందుకూ?’ అనిపిస్తోంది కదూ. కానీ దీని వ్యవస్థాపకుల లక్ష్యం కేవలం లాభనష్టాలతో ముడిపడింది కాదు.

పర్యటన కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసిన వైట్‌ డెజర్ట్‌’ సంస్థ
పులావ్‌ నుంచి సాల్మన్‌ చేపల ఫ్రై దాకా...

ఆ ఇద్దరే...

ఆ ఇద్దరూ పర్యటనలంటే ప్రాణంపెట్టే యువదంపతులు. అతని పేరు ప్యాట్రిక్‌, ఆమె పేరు రాబిన్‌. వాళ్లిద్దరూ అంటార్కిటికాని ఒకటికి మూడుసార్లు కాలినడకన పర్యటించినవాళ్లు! అప్పుడే ‘సైంటిస్టులకీ, తమలాంటి సాహసయాత్రికులకే పరిమితమైన అంటార్కిటికా పర్యటనని సామాన్యులకీ చేరువచేయాల’న్న ఆలోచన వచ్చిందట. ఫలితంగానే ‘వైట్‌ డెజర్ట్‌’ని ఏర్పాటుచేశారు. మిగతా సంస్థల్లా దక్షిణ అమెరికా నుంచి ఓడల్లో కాకుండా... దక్షిణాఫ్రికా కేప్‌ టౌన్‌ నుంచి నేరుగా విమానంలో తీసుకెళ్తారు వీళ్లు. ఎనిమిదిరోజుల పర్యటనలో భూమిలోని అత్యంత లోతట్టు ప్రాంతాన్నీ, దక్షిణధ్రువం చిట్టచివరి కొసనీ, వేలాది పెంగ్విన్‌లు ఉండే ‘అట్కిన్‌ బే’నీ, నీటిలో తేలే డ్రైగాల్స్‌నీ మంచు పర్వతశ్రేణుల్నీ చూపిస్తారు. నడక, ట్రెక్కింగ్‌, బస్సు ప్రయాణం, విమానం, హెలికాప్టర్‌, పడవలూ... ఇలా రకరకాలుగా సాగుతుందీ పర్యటన! దీన్ని కుదించి ఒకరోజుకే పరిమితం చేసే ప్యాకేజీ కల్పిస్తున్నారు. ఈ పర్యటనలకి పది నుంచి డెబ్భైలక్షల రూపాయలదాకా ఖర్చవుతుంది!

ఇదీ చదవండి:అంతరిక్షంలో చనిపోతే ఏమవుతాం?

ABOUT THE AUTHOR

...view details