తెలంగాణ

telangana

ETV Bharat / city

VIJAYAWADA DURGA TEMPLE: 'బెజవాడ దుర్గమ్మ' కాటేజీల్లో నెలల తరబడి పాలకులు, అధికారుల తిష్ట! - telangana news

ఏపీలోని విజయవాడ దుర్గగుడికి రెండున్నర నెలల కిందట అన్నవరం ఆలయం నుంచి ఇద్దరు సూపరింటెండెంట్లు బదిలీపై వచ్చారు. వాళ్లు ఒకటి, రెండు రోజులు ఉంటామంటూ ఆలయానికి చెందిన మాడపాటి సత్రంలో గదులు తీసుకున్నారు. అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. రోజుకు రూ.2 వేల అద్దె ఉన్న వాటిని నెలల తరబడి వాడుతున్నారు. దీనివల్ల ఒకవైపు దుర్గగుడి ఆదాయానికి గండి పడడంతో పాటు.. భక్తులకు అసౌకర్యం కలుగుతోంది.

vijayawada temple
vijayawada temple

By

Published : Sep 12, 2021, 12:02 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ దుర్గగుడికి పక్కనే ఉన్న జమ్మిదొడ్డి సత్రం భక్తులకు ఒకప్పుడు ఎంతో ఉపయోగపడేది. దానిలోని గదులను పడగొట్టి.. సూట్‌ రూంలుగా మార్చారు. వాటినే ప్రస్తుతం కార్యాలయాలుగా మార్చేసుకున్నారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి కార్యాలయం ఇక్కడే పెట్టుకున్నారు. మరో మంత్రికి చెందిన బంధువు కూడా ఇక్కడ ఉన్న సూట్‌రూంను తన ఆధీనంలో ఏడాదిన్నరకు పైగా ఉంచుకున్నారు. కింది భాగంలో ఉన్న హాల్‌ను సమావేశాలకు వినియోగిస్తున్నారు.

భక్తులకు బస ఇక్కట్లు

విజయవాడ దుర్గగుడికి దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు.. ఇక్కడ బస చేయడానికి ఒక్కటంటే ఒక్క కాటేజీ కూడా లేదు. గతంలో ఉన్న ఒకటి, రెండు కాటేజీలను కూడా ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, వారి బంధువుల అవసరాలకు, దుర్గగుడిలో పనిచేసే కొంతమంది సిబ్బంది ఉండేందుకు వినియోగించుకుంటున్నారు. పదేళ్ల కిందట దుర్గగుడికి సమీపంలోనే రెండు మూడు సత్రాలు ఉండేవి. ఆలయానికి వచ్చే భక్తులు వాటిలో ఉండేవారు. దీనివల్ల దేవస్థానానికి ఆదాయంతో పాటు భక్తులకు సౌకర్యంగా ఉండేది. ఏపీలోని శ్రీశైలం, అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం.. ఇలా ఏ పెద్ద ఆలయాన్ని చూసినా ఏటేటా భక్తులకు సౌకర్యాలు పెరుగుతుంటాయి. కానీ.. దుర్గగుడిలో మాత్రం ఉన్న వాటిని కూడా లేకుండా చేస్తున్న తీరు.. అత్యంత బాధాకరం. గతంలో ఉన్న ఆ మూడు నాలుగు సత్రాలను కూడా ఇతర అవసరాల కోసం వినియోగించుకుంటూ భక్తులకు నిలువ నీడలేకుండా చేస్తున్నారు.

గతంలో ఉన్నవాటిని తొలగించి...

గతంలో దుర్గగుడిలో తెల్లవారుజామున నిర్వహించే ఖడ్గమాల పూజ తదితర వాటిల్లో పాల్గొనేందుకు టిక్కెట్లు కొనుక్కునే భక్తులు ముందురోజు రాత్రే వచ్చి కొండ కింద ఉన్న జమ్మిదొడ్డి సత్రంలో ఉండేవారు. అక్కడ గతంలో 12 కాటేజీలు ఉండేవి. కొన్నేళ్ల కిందట ఆ కాటేజీలన్నింటినీ తొలగించి.. విశాలంగా ఉండేలా సూట్‌రూంలుగా రూ.లక్షలు ఖర్చుపెట్టి మార్చారు. అంతే అప్పటినుంచి వాటిని భక్తులకు ఇవ్వడం ఆపేశారు. సూట్‌రూంలుగా మార్చిన ఈవో మారిన వెంటనే ఆ తర్వాత వచ్చిన అధికారి.. వాటిని ఏకంగా తన కార్యాలయంగా మార్చుకున్నారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి కూడా అక్కడే కార్యాలయం పెట్టారు. ఇక అంతే.. ఆ తర్వాత మిగిలిన ఒక సూట్‌ రూంలో మరో మంత్రి బంధువు పాగా వేశారు. ప్రస్తుతం దుర్గగుడికి చెందిన మాడపాటి సత్రాన్ని కూడా అధికారులు, వారి బంధువులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్లు వచ్చినప్పుడు దర్జాగా వాడుకుంటున్నారు. బదిలీపై వచ్చిన సిబ్బంది నెలల తరబడి ఇక్కడి గదుల్లో ఉంటుంటే ఇక సాధారణ భక్తులకు ఇచ్చేందుకు అవకాశం ఉండడం లేదు. ప్రస్తుతం మాడపాటి సత్రం గదులను ఇచ్చేందుకు సిఫార్సు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటోంది.

భక్తులకు మిగిలినవి డార్మెటరీలే..

భక్తులకు ప్రస్తుతం మిగిలినవి.. డార్మెటరీలు మాత్రమే. అవికూడా రైల్వేస్టేషన్‌కు పక్కనున్న సి.వి.రెడ్డి ఛారిటీస్‌లో ఉన్నాయి. ఈ డార్మెటరీల్లో ఉండే మంచాలను అద్దెకు తీసుకుని ఉండడం ఒక్కటే భక్తులకు ఉన్న మార్గం. ఇది దుర్గగుడికి కొద్దిగా దూరంగా ఉండడం, అందరికీ కలిపి మంచాలు ఒకే గదిలో వేసి ఉంచడంతో చాలామంది ఇక్కడ ఉండేందుకు ఆసక్తి చూపించడం లేదు. వేర్వేరుగా గదుల్లా ఉంటే.. భక్తులకు సౌకర్యంగా ఉంటుంది. అలా లేకపోవడంతో రూ.కోట్లను ఖర్చుపెట్టి ఈ డార్మెటరీలను నిర్మించినా.. దానిపై వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. ఇప్పటికైనా భక్తులకు సౌకర్యాల కల్పనపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చదవండి:cisf: వారి వసతి కోసం తెలుగు రాష్ట్రాలపై వందల కోట్ల భారం?

ABOUT THE AUTHOR

...view details