తెలంగాణ

telangana

ETV Bharat / city

గ్రూపు-4 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులేవి?

Group-4 Jobs Notification : రాష్ట్రంలో గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీ ఊసేలేదు. వీటి ప్రకటన జారీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించిన సర్కార్ ఇప్పటివరకు పోస్టుల మంజూరుపై ఉత్తర్వులు జారీ చేయలేదు. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ఈనెల 29నాటికి టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వ విభాగాల వారీగా రోస్టర్‌, రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రతిపాదనలివ్వాలని గడువు విధించినప్పటికీ జీవో ఇవ్వకపోవడంతో ముందడుగు పడే పరిస్థితిలేదు.

Group-4 Jobs Notification
Group-4 Jobs Notification

By

Published : May 28, 2022, 9:22 AM IST

Group-4 Jobs Notification : రాష్ట్రంలో 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి ముందడుగు పడటంలేదు. వీటి ప్రకటన జారీ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించిన ప్రభుత్వం ఇప్పటివరకూ పోస్టుల మంజూరుపై ఉత్తర్వులు ఇవ్వలేదు. 80 వేల ఉద్యోగాల భర్తీ అని పేర్కొన్నప్పటికీ ఇప్పటికి 30,453 పోస్టులకు మాత్రమే అనుమతిచ్చింది. అందులో 17,307 పోస్టులకు ప్రకటనలు వెలువడ్డాయి. గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి ఈనెల 29నాటికి టీఎస్‌పీఎస్సీకి ప్రభుత్వ విభాగాల వారీగా రోస్టర్‌, రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రతిపాదనలివ్వాలని గడువు విధించినప్పటికీ జీవో ఇవ్వకపోవడంతో ముందడుగు పడే పరిస్థితిలేదు. ప్రభుత్వ విభాగాలు, సొసైటీలు, కార్పొరేషన్లు, స్వయంప్రతిపత్తి సంస్థలు, యూనివర్సిటీలలో గ్రూప్‌-4 ఖాళీల ప్రతిపాదనలు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న విభాగాలు :రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకూ 30,453 పోస్టుల భర్తీకి అనుమతి ఉత్తర్వులిచ్చింది. వీటిలో 3,576 పోస్టుల బాధ్యత టీఎస్‌పీఎస్సీకి, 16,804 పోస్టులను పోలీసు నియామక బోర్డుకు, 10,028 పోస్టులు వైద్య నియామకమండలికి, 45 పోస్టులు డీఎస్సీకి అప్పగించింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 కింద 503 పోస్టులకు, పోలీసు నియామక బోర్డు 16,804 పోస్టులకు ప్రకటన ఇచ్చాయి. వైద్య నియామకమండలి వెయిటేజీ, అర్హతల పేరిట ప్రకటనలపై నిర్ణయం తీసుకోలేదు.

గ్రూప్‌-4 కింద 9,168 పోస్టులుండగా వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎస్‌ ఆధ్వర్యంలో సన్నాహక సమీక్ష జరిగింది. ఈనెల 29కల్లా ప్రతిపాదనలు పంపాలని ఆయన ఆదేశించారు. గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఉత్తర్వులు లేకపోవడంతో ప్రభుత్వ విభాగాలకు ప్రతిపాదనల తయారీపై సందిగ్ధం నెలకొంది. కొన్ని విభాగాలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపిన ఖాళీల సంఖ్య మేరకు రోస్టర్‌ వారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నాయి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల నేపథ్యంలో రోస్టర్‌-1 నుంచి రిజర్వేషన్లు అమలవ్వనున్నాయి. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో పోస్టుల సంఖ్య తగ్గడంతో సీఎం ప్రకటించిన మేరకు ఖాళీలుండేలా చూడాలని సీఎస్‌ సూచించారు.

గురుకులాలకు టీచర్లు ఆలస్యం :పాఠశాల విద్యాశాఖలో టీచర్ల పోస్టులకు టెట్‌ అర్హత తప్పనిసరి. గురుకులాల్లో టీజీటీకి మినహా మిగతా పోస్టులకు టెట్‌తో సంబంధం లేదు. గురుకుల నియామక బోర్డు పరిధిలో 10వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓవైపు గురుకులాలు ఉన్నతీకరణతో జూనియర్‌ కళాశాలల స్థాయికి చేరుకున్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి రెగ్యులర్‌ టీచర్లు వస్తారని భావించినప్పటికీ, ఆలస్యం కానుంది. గురుకుల నియామకబోర్డు పరిధిలో బీసీ గురుకుల సొసైటీలో 3,600, మైనార్టీలో 2,000, ఎస్సీలో 2,000, గిరిజన సొసైటీలో 1,800 పోస్టులుంటాయని అంచనా. టీజీటీ మినహాయించి, ప్రిన్సిపల్‌, పీజీటీ, జూనియర్‌, డిగ్రీ లెక్చరర్స్‌, పీఈటీ, ఆర్ట్‌, క్రాఫ్ట్‌ టీచర్ల పోస్టుల భర్తీకి అవకాశముంది. టెట్‌ ఫలితాలు వచ్చేవరకు టీజీటీ మినహా మిగతా పోస్టుల ప్రకటనకు సిద్ధంగా ఉన్నట్లు గురుకుల బోర్డు సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లింది.

ABOUT THE AUTHOR

...view details