Telangana TRT Notification : సర్కారు బడుల్లో ఉపాధ్యాయ ఖాళీలను నింపుతామని మార్చిలో ప్రకటించిన ప్రభుత్వం నేటికీ ఆమోదం తెలపలేదు. ఉపాధ్యాయ నియామకాలకు టెట్‌ను నిర్వహించిన సర్కారు శుక్రవారం వాటి ఫలితాలను వెల్లడించింది. తర్వాతి ప్రక్రియ టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్టు(టీఆర్టీ) గురించి ఏమీ ప్రకటించలేదు.
TRT Notification : టెట్ ఓకే.. మరి టీఆర్‌టీ నోటిఫికేషన్ ఎప్పుడు..? - టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్
Telangana TRT Notification : ఉపాధ్యాయ నియామకాలకు టెట్ నిర్వహించిన సర్కార్ శుక్రవారం రోజున వాటి ఫలితాలు విడుదల చేసింది. కానీ తర్వాతి ప్రక్రియ టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్టు(టీఆర్టీ) గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికిప్పుడది వచ్చినా నియామక ప్రక్రియ పూర్తయేందుకు 6-9 నెలల సమయం పడుతుంది. ఈ విద్యా సంవత్సరం(2022-23) ఏప్రిల్ 23తో ముగుస్తుంది. అంటే దాదాపు ఈ విద్యాసంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులు రాకపోవచ్చని భావిస్తున్నారు.
రాష్ట్రంలో 80 వేలకుపైగా ఉద్యోగ ఖాళీలను పూరిస్తామని మార్చి 9న సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో పాఠశాల విద్యాశాఖలో 13,086 కొలువులుంటాయన్నారు. బోధనేతర పోస్టులను పక్కనబెడితే మోడల్ పాఠశాలలు, తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోని ఖాళీలతో కలిపి సుమారు 11వేల ఉపాధ్యాయ ఉద్యోగాలున్నాయి. వాటిలో ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్‌జీటీ) కొలువులు 6,400 వరకు ఉండనున్నాయి. మరో 3,600 వరకు 6-10 తరగతులకు బోధించే స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ) ఖాళీలుంటాయని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది. అంటే స్థానిక సంస్థలు, ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీచేసే ఉద్యోగాల సంఖ్య 10వేల వరకు ఉంది. వాటిని టీఆర్‌టీ ద్వారా భర్తీచేయాలి. ఉపాధ్యాయులకు పదోన్నతులిస్తే మరో 10వేల వరకు ఖాళీలు ఏర్పడతాయని అంచనా.
సర్కారేమో అసెంబ్లీలో ప్రకటించిన మేరకే భర్తీచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆమోదం కోసం ప్రభుత్వానికి ఇటీవల ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. వాటికి ఆర్థికశాఖ ఆమోదం తెలిపితేనే టీఆర్‌టీ నోటిఫికేషన్ వెలువడుతుంది. ఇప్పటికిప్పుడది వచ్చినా నియామక ప్రక్రియ పూర్తయేందుకు 6-9 నెలల సమయం పడుతుంది. ఈ విద్యా సంవత్సరం(2022-23) ఏప్రిల్ 23తో ముగుస్తుంది. అంటే దాదాపు ఈ విద్యాసంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులు రాకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు విద్యా వాలంటీర్ల నియామకమూ లేకపోవడంతో బోధనపై ప్రభావం పడనుంది.