Group 1 Prelims 2022 : గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో తొలిదశ వడపోత పరీక్ష(ప్రిలిమ్స్) నిర్వహణపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు ఆరంభించింది. అత్యధికంగా 503 పోస్టులతో వెలువడిన ఈ ప్రకటనకు రికార్డుస్థాయిలో 3,80,202 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగ ప్రకటనలో జులై లేదా ఆగస్టు నెలల్లో ప్రిలిమినరీ ఉంటుందని కమిషన్ గతంలో ప్రకటించింది. అయితే సెప్టెంబరు నెలాఖరు వరకు పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సివిల్స్, బ్యాంకు, పోలీసు కొలువుల పరీక్షలకు షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, ఇతర పోటీ పరీక్షల తేదీలను దృష్టిలో పెట్టుకుని ప్రిలిమ్స్ తేదీపై ముందుకు వెళ్లాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.
జులై, ఆగస్టుల్లో పరీక్షలతో ఇబ్బందులు!
Group 1 Prelims Exam : గ్రూప్-1 పరీక్షలకు పోటీపడుతున్న వారిలో నిరుద్యోగులతోపాటు చిన్న, తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్నవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ దరఖాస్తు చేసిన 51,553 మందిని మినహాయిస్తే మిగతా 3.3 లక్షల మంది ఇలాంటి వారే. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలకు దీర్ఘకాల సెలవు పెట్టేందుకు, రాజీనామా చేసేందుకు వీరికి నిర్బంద ఒప్పంద గడువు వంటి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జులై నెలాఖరు లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రిలిమ్స్ నిర్వహిస్తే సన్నద్ధమయ్యేందుకు ఇబ్బందులు వస్తాయని, కొంత గడువు కావాలంటూ రోజూ వేలమంది కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆగస్టు, సెప్టెంబరులో వీలుకానట్టే
Group 1 Preliminary Exam 2022 : గ్రూప్-1 ఉద్యోగాలకు పట్టభద్రులతో సహా ప్రొఫెషనల్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు పోటీ పడుతున్నారు. విద్యార్హతలు, వయసు పరిగణనలోకి తీసుకుంటే వీరిలో ఎక్కువ మంది పోలీసు ఉద్యోగాలతోపాటు బ్యాంకు పోటీ పరీక్షలకూ హాజరయ్యే అవకాశాలున్నాయి. సాధారణంగా పోటీ పరీక్షలు సెలవు రోజుల్లో నిర్వహిస్తారు. ఆ ప్రకారం ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఇప్పటికే ఆర్‌బీఐ, యూపీఎస్సీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ, ఎన్‌డీఏ, సీడీఎస్, సివిల్స్ మెయిన్స్ పరీక్షలతో షెడ్యూలు ఖరారైంది. ఆగస్టులో పోలీసు ఉద్యోగాలకు ప్రిలిమ్స్ ఉండటంతో ఆ నెలలో పరీక్ష నిర్వహిస్తే, రెండు ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రూప్-1 ఉద్యోగాలకు పోటీపడే వారిలో ఎక్కువ మంది యూపీఎస్సీ పరీక్షలకూ హాజరవుతారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలను కమిషన్ పరిశీలిస్తోంది. ఈ మేరకు కమిషన్ సమావేశమై అన్ని అంశాలను చర్చించిన తరువాత గ్రూప్-1 ప్రిలిమ్స్ తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.