'ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం. వీటికి న్యాయపరమైన ఇబ్బందులు లేవు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాక.. ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్ విడుదల చేస్తాం' ఇది ఏపీ ఎన్నికల సంఘం మంగళవారం చేసిన ప్రకటన. ఈ పంచాయతీ ఎన్నికల అంశం మరోసారి రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీలో కొవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయని, సోమవారం తొలిసారి వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఈ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకుని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన తర్వాత, రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకున్నాకే, తగిన కొవిడ్ రక్షణ చర్యలు చేపడుతూ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనట్టు వెల్లడించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్ని, వివిధ రాష్ట్రాల్లో శాసనసభ ఉపఎన్నికల్ని ఇటీవల నిర్వహించిన విషయాన్ని రమేశ్ కుమార్ ప్రస్తావించారు. ఈ క్రమంలో సక్రమంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'ఇప్పుడు కష్టం'
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వం అంటోంది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌కు... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం లేఖ రాశారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు.. వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని నీలం సాహ్ని లేఖలో పేర్కొన్నారు. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని సీఎస్ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు అనుకూలించిన వెంటనే ఎస్‌ఈసీకి ఎన్నికల నిర్వహణపై సమాచారం అందిస్తామని తెలిపారు.
ఏపీ సీఎస్ నీలం సాహ్ని లేఖపై ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తీవ్రంగా స్పందించారు. సీఎస్ లేఖ ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని స్పష్టం చేశారు. సీఎస్ చర్య రాజ్యాంగ వ్యవస్థను కించపరచడమేనని చెప్పారు. ఈ మేరకు ఎస్‌ఎంఎస్ ద్వారా సీఎస్‌కు సమాధానం పంపారు.