తెలంగాణ

telangana

ETV Bharat / city

PETROL PRICE HIKE: లీటర్​ పెట్రోల్​ ధర 45 రూపాయలే.. కానీ - telangana latest news

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అడ్డూ అదుపు లేకుండా (petrol and diesel prices) పెరుగుతున్నాయి. వాహనదారులు బెంబేలెత్తుతున్నా.. చమురు సంస్థలు మాత్రం ఇష్టారీతిన పెంచేస్తున్నాయి. లీటరు పెట్రోల్‌ ధర 110 రూపాయలకు చేరువవుతుండగా.. డీజిల్​ 102 రూపాయలకు దగ్గరగా వచ్చింది. అక్టోబరు నాలుగో తేదీ మినహా రోజూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన ఆరు నెలల్లో పెట్రోల్‌పై లీటరుకు రూ.14.65, డీజిల్‌పై లీటరుకు రూ.13.60 ధరలు పెరగడంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. నిత్యం పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

PETROL PRICE HIKE
PETROL PRICE HIKE

By

Published : Oct 11, 2021, 4:50 PM IST

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల పరంపర (petrol and diesel prices) కొనసాగుతూనే ఉంది. అక్టోబరు 4న మినహా రోజూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి మూడు రోజులకు రూపాయి.. అంతకంటే ఎక్కువే లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై చమురు సంస్థలు పెంచేస్తున్నాయి. ఆకాశమే హద్దుగా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే వంద దాటి పరుగులు తీస్తున్న పెట్రోల్‌ లీటరు ధర హైదరాబాద్​లో ప్రస్తుతం 108.6కి చేరగా.. డీజిల్‌ లీటరు రూ.101.62కి చేరింది. వరుసగా పెరుగుతున్న ధరలు.. సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయి. మరోవైపు రవాణా వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం పడుతుండడంతో అన్ని రకాల సరకుల ధరలు పెరిగిపోతున్నాయి.

పార్లమెంట్​ సమావేశాలు జరిగినన్ని రోజులు పెరగలే..

పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు (PETROL PRICE HIKE)ఆ తర్వాత వెనక్కి చూడకుండా పరుగులు తీస్తున్నాయి. రోజూవారీ 30 పైసలకు తక్కువ లేకుండా ధరలను పెంచేస్తున్నాయి. ఈ ధరల పెరుగుదల (petrol and diesel prices) ఎప్పటి వరకు ఉంటుందో.. తెలియని పరిస్థితి నెలకుంటోంది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ల పేరుతో ఇష్టానుసారం పెంచి.. ప్రజలను నిలువుదోపిడీ చేసేస్తున్నాయి.

'లీటర్​ పెట్రోల్​ రూ.45'

పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఆదివారం అంతర్జాతీయ మార్కెట్‌ విపణిలో ముడి చమురు 159 లీటర్లు సామర్థ్యం కలిగిన బ్యారెల్‌ ధర రూ.5,944గా ఉంది. అంటే లీటరు ముడి చమురు రూ.37.38 మాత్రమే.. అంటే అటు పెట్రోల్‌, ఇటు డీజిల్​ ప్రాసెసింగ్‌ చేసేందుకు, ఫ్రైట్‌ ఛార్జీలు, ఇతరత్రా అన్నీ కలిపితే లీటరు రూ.45కు మించదు.

నిలువుదోపిడీ..

ఇక్కడ నుంచే అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నిలువు దోపిడీ మొదలవుతుంది. లీటరు పెట్రోల్‌పై రూ.32.90లు, డీజిల్‌పై రూ.31.80లు ఎక్సైజ్‌ డ్యూటీ, రోడ్‌ సెస్‌లను కేంద్రం విధిస్తోంది. పెట్రోల్‌ లీటరుపై రూ. 3.79లు, డీజిల్‌పై 2.59లు చమురు సంస్థలు డీలర్‌ కమిషన్‌ ఇస్తాయి. డీలరు కమిషన్‌ను కూడా కలిపితే లీటరు పెట్రోల్‌ రూ.50 రూపాయలు, లీటరు డీజిల్‌ 48 రూపాయలకు మించదు. కానీ నేటికి హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటరు పెట్రోల్​ ధర రూ.108.6, లీటరు డీజిల్ ధర రూ.101.62గా ఉంది.

41 రోజుల్లో..

2021-22 ఆర్థిక ఏడాది ప్రారంభంలో అంటే ఏప్రిల్‌ ఒకటో తేదీన పెట్రోల్‌ లీటరు ధర రూ.93.99లుగా (petrol and diesel prices) ఉండగా డీజిల్‌ లీటరు ధర రూ.88.05గా ఉన్నాయి. సోమవారం నాటి ధరలతో బేరీజు వేస్తే లీటరు పెట్రోల్‌పై ఏకంగా రూ.14.65లు, డీజిల్‌పై ఏకంగా రూ.13.60లు ధరలు పెరిగాయి. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఇవాళ్టి వరకు 41 రోజుల్లో.. లీటరు పెట్రోల్​పై రూ.2.93, లీటరు డీజిల్​పై రూ.4.43 పెరిగినట్లు చమురు సంస్థల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

సామాన్యుల ఆగ్రహం..

ఇంధన ధరలు పెరుగుతుండడంపై సామాన్యులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం పెంచుకుంటూ పోతే.. తాము ఎట్లా బతకాలని ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్​, డీజిల్​ ధరలు సహా నిత్యావసరాల రేట్లు పెరిగిపోతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులనూ తీసుకురావాలని కేంద్రం యోచిస్తుండగా రాష్ట్రాలు తమకు వచ్చే ఆదాయానికి గండి పడుతుందని చెప్పి ముందుకు రావడంలేదని కొందరు వాహనదారులు ఆరోపిస్తున్నారు.

గత ఆరునెలల్లో..

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలను ఈ ఆర్థిక సంవత్సరం (petrol and diesel prices) ప్రారంభం నుంచి పరిశీలించినట్లయితే.. పెట్రోల్‌పై ఏప్రిల్‌లో 18 పైసలు, డీజిల్‌పై 17 పైసలు ధర తగ్గింది. మే నెలలో పెట్రోల్‌పై రూ.4.02, డీజిల్‌పై రూ.5.15 పెరిగింది. జూన్‌ నెలలో పెట్రోల్‌పై రూ.4.37, డీజిల్‌పై రూ.4.24 లెక్కన ధరలు ఎగబాకాయి. జులై నెలలో పెట్రోల్‌పై రూ.2.97, డీజిల్‌పై 78 పైసలు లెక్కన పెరిగాయి. ఆగస్టులో పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై ఒక్క పైసా తగ్గాయి. సెప్టెంబరులో పెట్రోల్‌పై 32 పైసలు, డీజిల్‌పై రూ.1.24 పెరగ్గా.. ఈ నెలలో గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై రూ.2.46, డీజిల్‌పై రూ.3.22 లెక్కన ధరలు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అక్టోబరు నాలుగో తేదీ మినహా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు (petrol and diesel prices hike)పెరుగుతూనే వస్తున్నాయి.

ఇదీచూడండి:పెట్రో వాత.. వరుసగా ఏడో రోజూ పెరిగిన ఇంధన ధరలు

ABOUT THE AUTHOR

...view details