ప్రభుత్వ భూములు కబ్జాలతో కరిగిపోతున్నాయి. గుట్టుగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 2.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాకు గురైందని 2018లో రెవెన్యూశాఖ తేల్చింది. ఈ నెల 4న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో సీఎం మాట్లాడుతూ.. గ్రామంలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చెరలో ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్రమాల్ని తేల్చేందుకు రెవెన్యూ యంత్రాంగం సర్వే ప్రారంభించింది. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో ప్రభుత్వ భూమిని కాపాడటంలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఇదే నెల 4న హైకోర్టు సైతం రెవెన్యూ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూముల రక్షణకు జియో మ్యాపింగ్ చేసి, రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ సంఘటనలతో ప్రభుత్వ భూముల ఆక్రమణల వ్యవహారం మరోమారు చర్చనీయాంశంగా మారింది.
నిర్దిష్ట చర్యలు కరవు
ప్రభుత్వం నుంచి వివిధ శాఖలకు కేటాయించిన భూములూ ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత(కస్టోడియన్) రెవెన్యూ శాఖదే అయినా.. వాటిని అప్పగించాక ఆ శాఖ అధికారులే రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు కొన్నిచోట్ల కబ్జాలకు గురయ్యాయి. కొందరు లబ్ధిదారులు వాటిని విక్రయించుకున్నారు. రాష్ట్రంలో 1954 నుంచి 2014 వరకు 21.36 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచారు. అధికారికంగా 2.41 లక్షల ఎకరాలు చేతులు మారినట్లు గుర్తించగా, అనధికారికంగా అది మరో లక్ష ఎకరాలకుపైగా ఉండొచ్చని అంచనా. ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తూ సర్కారు భూముల్లో సాగు చేసుకుంటున్న విస్తీర్ణం మరో 1.62 లక్షల ఎకరాలు ఉంది. దీనిపైనా యాజమాన్య హక్కులు ప్రభుత్వానివే అయినా.. సాగులో మాత్రం ఇతరులు ఉన్నారు. అసైన్డ్ కబ్జాలపై చర్యలకు 2019లో ప్రభుత్వం ఉపక్రమించినా ముందడుగు పడలేదు. ‘రాష్ట్రంలో ముందుగా సమగ్ర భూసర్వే నిర్వహించాలి. తద్వారా సరిహద్దులు, కబ్జాలు తేలిపోతాయి. క్షేత్రస్థాయిలో రక్షణ చర్యలు బలహీనంగా మారాయి. ఆక్రమణలపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిఫార్సు చేయాలి లేదా టాస్క్‌ఫోర్స్‌ను నియమించాలి. లేకుంటే కబ్జాలు తగ్గవు’ అని ఓ రెవెన్యూ ఉన్నతాధికారి చెప్పారు.