తెలంగాణ

telangana

By

Published : Aug 31, 2020, 7:12 AM IST

ETV Bharat / city

లక్ష్యం చేరని పుస్తకం... డిజిటల్‌ తరగతులు ఎలా?

సెప్టెంబరు 1 నుంచి ఆన్​లైన్ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వ నిర్ణయించింది. వేలాదిమంది విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందలేదు. వసతిగృహాల విద్యార్థుల్లో సగం మందికే అందాయి. స్వగ్రామాలకు వెళ్లిన విద్యార్థులకు అందించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పుస్తకాలు లేకుండా డిజిటల్‌ తరగతులు ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

BOOKS
BOOKS

డిజిటల్‌ తరగతుల ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడుతున్నా ఇప్పటికీ వేలాది మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందని పరిస్థితి ఉంది. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థుల్లో సగానికిపైగా అవి దరి చేరలేదు. కొన్నింటికి అసలే పంపిణీ కాలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,800 ప్రభుత్వ పాఠశాలల్లో 3.50 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. వాళ్లలో 30 శాతం వలస జీవుల పిల్లలే. వాళ్లంతా లాక్‌డౌన్‌తో తల్లిదండ్రులతో పాటు సొంతూళ్లకు వెళ్లి తిరిగి రాలేదు. వారెవరికీ పుస్తకాలు అందలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో 2.60 లక్షల మంది ఉండగా వారిలో ఇంకా కనీసం 20-30 శాతం మందికి అందలేదని అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకూ కొన్నిచోట్ల పుస్తకాలు అందని పరిస్థితి ఉంది. ఉదాహరణకు మూడో తరగతి పర్యావరణం, పరిసరాల విజ్ఞానం పుస్తకాన్ని తెలుగు, ఆంగ్లంలో ముద్రించారు. ముద్రణ ఆలస్యం కావడంతో అవి మండలాలకు సరఫరా కాలేదు. ఈ పరిస్థితుల్లో సెప్టెంబరు 1వ తేదీ నుంచి మొదలయ్యే డిజిటల్‌ తరగతులను విద్యార్థులు ఎలా అనుసరిస్తారనే ప్రశ్న ఉపాధ్యాయవర్గాల్లో వ్యక్తమవుతోంది.

‘ఇప్పటికైనా విద్యాశాఖ స్పందించాలి. అతి త్వరగా ప్రతి విద్యార్థికీ పుస్తకాలు అందేలా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలి. విద్యార్థి చదివే పాఠశాల, వసతి గృహంతో సంబంధం లేకుండా వారు ఉన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల లేదా వసతి గృహాల్లో పుస్తకాలు అందించే ఏర్పాట్లు చేయాలని’ పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నయ్య సూచించారు.

ఇవిగో ఉదాహరణలు

  • ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్‌సీ-ఏ హాస్టల్‌లో 110 మంది విద్యార్థులుండగా, ఒక్కరికీ పుస్తకాలు అందలేదు. నగరంలోని మిగిలిన హాస్టళ్ల పరిస్థితీ అంతే.
  • రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1600 మందికిపైగా ఉండగా, 400 మంది వరకు ఎస్‌సీ, ఎస్‌టీ హాస్టళ్ల విద్యార్థులే. వారిలో కేవలం 30 శాతం మందికే పుస్తకాలు చేరాయి.
  • మెదక్‌ జిల్లా జోగిపేటలోని హాస్టళ్ల విద్యార్థుల్లో 20 శాతం మంది దూర ప్రాంతాల వాళ్లే. వాళ్లు ఇంకా పుస్తకాలు తీసుకోలేదు.
  • హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ ఉన్నత పాఠశాలలో 6-9 తరగతులకు చెందిన 750 మందిలో 60 శాతం మందికే పుస్తకాలు అందజేశారు. మిగిలిన వాళ్లు సొంత జిల్లాలైన జనగామ, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు వెళ్లిపోయారు. ఫోన్లు చేసినా వారు రావడం లేదని, కొంత మంది ఫోన్‌ నెంబర్లు మారిపోయాయని అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు.
  • మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌ మండలం కౌకూర్‌ ఉన్నత పాఠశాలలో 180 మంది ఉండగా 50 మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. వారి పుస్తకాలు పాఠశాలలోనే ఉన్నాయని ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ తెలిపారు.
  • కరీంనగర్‌ జిల్లా వెల్లటూరు మండలం కప్పారావుపేట యూపీఎస్‌లో 1, 3, 4 తరగతులకు గణితం, ఈవీఎస్‌ పుస్తకాలు అందలేదు. గంగాధర మండలం కురిక్యాల ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతిలో 32 మంది ఉండగా 15 మందికే పుస్తకాలు అందాయి. నాలుగో తరగతికి గణితం, ఆంగ్లం పుస్తకాలే వచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details