Wet Paddy in Rice mills : కేంద్రం బియ్యం సేకరణను తేల్చలేదు. ధాన్యం నిల్వలను ఏమి చేయాలన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అయోమయం వీడలేదు. రాష్ట్రంలోని మిల్లుల్లో కుప్పలు తెప్పలుగా ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పెద్ద మొత్తంలో ధాన్యం తడిసిపోయింది. బస్తాల్లోనే ధాన్యం మొలకెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.పది వేల కోట్లు వెచ్చించి 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లుల్లో నిల్వ చేసింది. అప్పటికే మరో 40 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా ధాన్యం నిల్వలు మిల్లులో ఉన్నాయి.
Wet Paddy in Telangana Rice mills : యాసంగి ధాన్యం ఉప్పుడు బియ్యంగా మార్చటం దశాబ్దాలుగా ఆనవాయితీ. నిల్వలు భారీగా ఉన్న నేపథ్యంలో ఈ సీజనులో ఉప్పుడు బియ్యం స్థానంలో సాధారణ బియ్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేయటంతో సమస్య ఏర్పడింది. అప్పటికే వరి కోతలు మొదలయ్యాయి. వడ్లు కొనుగోలు చేయకపోతే రైతులు తీవ్రస్థాయిలో నష్టపోయే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వమే కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ మేరకు చర్యలు తీసుకుంది.
ఎటూ తేల్చని కేంద్రం..కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని రేషన్ కార్డుదారులకు ఇవ్వకపోవడంతో పాటు ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై చర్యలు తీసుకోని కారణంగా బియ్యం సేకరణ నిలిపివేస్తున్నట్లు గత నెల 7న ఎఫ్‌సీఐ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి కేంద్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. బియ్యం సేకరణను పునరుద్ధరించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల మొదటి వారంలో దిల్లీలో ప్రకటించినా ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ కాలేదు.