Weightage in Medical Recruitment : వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టనున్న నియామకాల్లో ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి వెయిటేజీ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత కొవిడ్ కాలంలో సేవలందించిన వారికి మాత్రమే వెయిటేజీ ఇవ్వాలని భావించినా.. చాలాకాలంగా వైద్యశాఖలో సేవలందిస్తున్న వారి ప్రాధాన్యతను గుర్తించి, అందరికీ వెయిటేజీని వర్తింపజేయాలని తీర్మానించింది.
వైద్య నియామక బోర్డు ద్వారా వేర్వేరు విభాగాల్లో భర్తీ చేయనున్న 10,028 ఖాళీలకు ఎంపిక విధానాన్ని మంగళవారం ప్రకటించారు. నియామకాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. 1.స్పెషలిస్టు సహాయ ఆచార్యులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (స్పెషలిస్టు) 2.ఎంబీబీఎస్ వైద్యులు (సివిల్ అసిస్టెంట్ సర్జన్, ట్యూటర్లు) 3.స్టాఫ్‌నర్సులు 4.ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్) / ఏఎన్‌ఎం తదితర పోస్టులను భర్తీ చేస్తారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ మంగళవారం మార్గదర్శకాలు జారీచేశారు.
- స్పెషలిస్ట్ వైద్యులకు పోస్టు గ్రాడ్యుయేట్ / సూపర్ స్పెషాలిటీ పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్ఠంగా 80 పాయింట్లు ఇస్తారు. మార్కులు ఇవ్వని విశ్వవిద్యాలయాల్లో చదివిన అభ్యర్థులకు గ్రేడ్లను పరిగణనలోకి తీసుకుంటారు. గ్రేడ్ ‘ఎ’లో ఉన్నవారికి 60, ‘బి’ గ్రేడ్‌లో ఉంటే 55, పాస్ గ్రేడ్‌లో ఉన్నవారికి 50 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. మిగిలిన 20 పాయింట్లను ఒప్పంద, పొరుగు సేవలసిబ్బందికి వెయిటేజీగా ఇస్తారు.
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో నియమించనున్న వైద్యులను సివిల్ అసిస్టెంట్ సర్జన్(జనరల్), జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్‌గా విభజించారు. వీరికి ఎంబీబీఎస్ మార్కుల శాతం ఆధారంగా గరిష్ఠంగా 80 పాయింట్లు ఇస్తారు. విదేశాల్లో వైద్యవిద్య పూర్తి చేసిన అభ్యర్థులకు జాతీయ వైద్య కమిషన్ నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్‌ఎంజీఈ)లో పొందిన మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటారు.
- సహాయ ఆచార్యులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ట్యూటర్లు, జనరల్‌్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఆయుష్ వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏ (స్త్రీ), ల్యాబ్-టెక్నీషియన్ గ్రేడ్-2, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, రేడియోగ్రాఫర్, పారా మెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్, ఫిజియోథెరపిస్ట్ తదితర పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌లకు 20 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇస్తారు.
- స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎంలకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడిన 80 మార్కుల రాత పరీక్ష నిర్వహిస్తారు. వీరికి 20 పాయింట్లు వెయిటేజీ ఇస్తారు. ఈ కేటగిరీ అభ్యర్థులు ఒప్పంద, పొరుగు సేవల అనుభవ ధ్రువపత్రం కోసం సంబంధిత ఉన్నతాధికారికి దరఖాస్తు చేయాలి. ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో పనిచేసే వారు ధ్రువీకరణను జిల్లా వైద్యాధికారుల ద్వారా పొందాలి. సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో పనిచేసే వారికి జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఇవ్వాలి.
అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న నిర్దేశిత కేటగిరీలో అందుబాటులో ఉన్న అన్ని పోస్ట్‌లకూ వారి ప్రాధాన్యాలను ప్రస్తావించాలి. పొందిన పాయింట్లు, ప్రాధాన్యత ఆధారంగా పోస్ట్‌లను కేటాయిస్తారు.
ఈసారి కొత్తగా సైకియాట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాల్లో నియామకాలు చేస్తున్నారు.
మరికొన్ని ...ఈసారి కొత్తగా సైకియాట్రీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ విభాగాల్లో నియామకాలు చేస్తున్నారు.
- రెండు రకాలుగా పోస్టుల భర్తీని చేపడతారు. 1.డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2. ప్రజారోగ్య సంచాలకుల విభాగం నుంచి విలీనం చేసుకోవడం
- పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ అర్హతలను స్పెషాలిటీ పోస్టులకు అర్హతగా పరిగణిస్తారు.
- పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులందరూ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి.
- టీవీవీపీలో కొత్తగా నియమితులయ్యే వైద్యులకు కూడా ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం వర్తిస్తుంది.
- బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సు పూర్తి చేసిన అర్హులైన నర్సులను నేరుగా నియమిస్తారు.
- దరఖాస్తు చేసుకునే నర్సులందరూ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ మండలిలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి.
- ఏఎన్‌ఎం/ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఫీమేల్) అర్హతతో ఉన్నవారు బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం కోర్సు పూర్తి చేస్తే వారు పదోన్నతులకు అర్హులు.
- క్లాస్ ఏ పారామెడికల్ (రేడియాలజీ టెక్నీషియన్) పోస్టులకు.. 1.సర్టిఫికెట్ ఆఫ్ రేడియాలజీ అసిస్టెంట్ 2.డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ 3.డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ 4.డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ 5.పీజీ డిప్లొమా ఇన్ ఇమేజియాలజీ 6.బీఎస్సీ రేడియాలజీ 7.బీఎస్సీ ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో ఉత్తీర్ణులైన వారు అర్హులు. వీరంతా తెలంగాణ రాష్ట్ర పారామెడికల్ బోర్డులో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి.
పారామెడికల్ పోస్టుల్లో పదోన్నతులకు ఆయా కోర్సుల్లో అర్హతతో పాటు డార్క్‌రూమ్ అసిస్టెంట్‌గా మూడేళ్ల అనుభవం ఉండాలి.
క్లాస్ బి పారామెడికల్ (ల్యాబ్ టెక్నీషియన్) పోస్టులకు.. ఈ కింది కేటగిరీల్లో వేటిల్లోనైనా అర్హత సాధించాలి.
1.ఎంఎల్‌టీ ఒకేషనల్/ఇంటర్మీడియేట్(ఎంఎల్‌టీ ఒకేషనల్).. ఏడాది అనుభవంతో.
2.డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు
3.బీఎస్సీ ఎంఎల్‌టీ/ఎంఎస్సీ ఎంఎల్‌టీ