Weight age for outsourcing employees : వైద్య ఆరోగ్యశాఖలో 12,735 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో.. నియామకాల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా వెయిటేజీకి సంబంధించిన అంశాలపై దృష్టిపెట్టింది. ఇప్పటి వరకూ కేవలం ఒప్పంద (కాంట్రాక్టు) ఉద్యోగులకు మాత్రమే నియామకాల్లో వెయిటేజీ ఇస్తున్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ :కొత్తగా చేపట్టనున్న వాటిలో సుమారు 50 వేల మందికి పైగా గల పొరుగు సేవల(ఔట్ సోర్సింగ్) ఉద్యోగులకు కూడా వెయిటేజీని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపై వైద్యఆరోగ్యశాఖ గత కొద్ది వారాలుగా ఉన్నత స్థాయిలో కసరత్తు చేస్తోంది. ప్రతిపాదనలు కొలిక్కి రావడంతో.. సంబంధిత దస్త్రాన్ని అనుమతుల కోసం ఇప్పటికే ప్రభుత్వానికి పంపించింది. త్వరలోనే పొరుగు సేవలకూ వెయిటేజీని వర్తింపజేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
ప్రతి అంశాన్ని క్షుణ్నంగా సరిచూసుకుంటూ.. : వైద్యఆరోగ్యశాఖలోని మొత్తం పోస్టులను మూడు విధానాల ద్వారా భర్తీ చేయనున్నారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంటు బోర్డు ద్వారా 10,028 పోస్టులు, టీఎస్‌పీఎస్‌సీ ద్వారా 2,662 పోస్టులు, డిపార్ట్‌మెంటు సెలక్షన్ కమిటీ ద్వారా నిమ్స్‌లో 45 పోస్టులను భర్తీ చేయడానికి అనుమతించారు. ఈ నియామకాల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలే ఇప్పుడు కీలకంగా మారాయి.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. ఈసారి కొత్తగా పొరుగు సేవల సిబ్బందికి కూడా వెయిటేజీని వర్తింపజేస్తుండడంతో.. ఈసారి చేపట్టబోయే నియామకాల్లో అన్ని రకాల జాగ్రత్తలను ముందే తీసుకోవాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకే ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా పరిశీలిస్తూ.. గత పొరపాట్లను సరిదిద్దుకుంటూ.. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా నిబంధనలను తయారు చేస్తున్నట్లుగా వైద్యవర్గాలు పేర్కొన్నాయి.