రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా కళాశాలలు, సీట్లను ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 161 కళాశాలల్లో 85,149 సీట్లకు యూనివర్సిటీలు అనుమతినిచినట్టు ఉన్నత విద్యా మండలి తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 146 ప్రైవేట్ కాలేజీల్లో.. 81,504 సీట్లు.. 15 యూనివర్సిటీ కళాశాలల్లో 3,645 ఇంజనీరింగ్ సీట్లు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చాయి. కన్వీనర్ కోటాలో 60,697 సీట్లు భర్తీ చేయనుండగా.. మిగతావి ప్రైవేట్ కాలేజీలు యాజమాన్య కోటాలో భర్తీ చేసుకొనున్నాయి. జేఎన్టీయూహెచ్ 130 ప్రైవేట్ కాలేజీల్లో 72,149 సీట్లకు అనుబంధ గుర్తింపునివగా.. ఓయూ 13 కళాశాలల్లో 8,990 సీట్లకు.. కాకతీయ యూనివర్సిటీ 3 కళాశాలల్లో 1,365 సీట్లకు ఆమోద ముద్ర వేశాయి. నేడు జేఎన్టీయూహెచ్ పరిధిలోని మరో 6 కాలేజీల్లో దాదాపు రెండున్నర వేల సీట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఈడబ్ల్యూఎస్ కోటా అమల్లోకి వచ్చినందున.. కన్వీనర్ కోటాలో సుమారు మరో ఆరున్నర వేల సూపర్ న్యుమరరీ సీట్లు మంజూరయ్యాయి. ఇవన్నీ కలిసి రాష్ట్రంలో సుమారు 94 వేల ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ డబ్ల్యూఎస్ సీట్లతో కలిపి.. దాదాపు 69వేల సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ కానున్నాయి.
బీ-ఫార్మసీ.. ఫార్మ్-డీ సీట్లు..
రాష్ట్రంలో 91 కాలేజీల్లో 7,640 బీ-ఫార్మసీ, 44 కాలేజీల్లో 1,295 ఫార్మ్-డీ సీట్లకు యూనివర్సిటీలు అనుమతినిచ్చాయి. రాష్ట్రంలో 88 ప్రైవేట్ కాలేజీల్లో 7,460 సీట్లు.. 3 యూనివర్సిటీ కళాశాలల్లో 180 బీ-ఫార్మసీ సీట్లకు ఈ ఏడాది అనుమతి లభించింది. కన్వీనర్ కోటాలో ఎంపీసీ అభ్యర్థులకు 2,611.. బైపీసీ అభ్యర్థులకు మరో 2,611 సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ కానున్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటాలో మరో 520 సూపర్ న్యుమరరీ సీట్లు మంజూరయ్యాయి. వీటిని కూడా కన్వీనర్ ద్వారా భర్తీ చేస్తారు. జేఎన్టీయూహెచ్ 51 ప్రైవేట్ కాలేజీల్లో 4,300 బీ-ఫార్మసీ సీట్లకు అనుబంధ గుర్తింపునిచ్చింది. ఓయూ 15 కళాశాలల్లో 1,420 సీట్లకు.. కాకతీయ యూనివర్సిటీ 22 కళాశాలల్లో 1,740 సీట్లకు ఆమోద ముద్ర వేశాయి.