ఎలక్ట్రానిక్స్ తయారీ గమ్యస్థానంగా తెలంగాణను మారుస్తామని ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. విధాన రూపకల్పనలో భాగంగా ప్రత్యేక ఎలక్ట్రానిక్స్ విధానాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. 912 ఎకరాల్లో రెండు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లు ఉన్నాయని పేర్కొన్నారు. దివిటిపల్లి, చందన్‌వెల్లిలో విద్యుత్ వాహనం, ఇంధన నిల్వ వ్యవస్థల అభివృద్ధికి రెండు కొత్త పారిశ్రామిక క్లస్టర్లు గుర్తించామని వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ తయరీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, మెతుకు ఆనంద్, మహేశ్ రెడ్డి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
'ఈ రంగాల్లో రూ.70వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి రానున్న నాలుగేళ్లలో 3 లక్షల మందికి ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 250కి పైగా ఉన్న ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం లక్షా 60వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. విద్యుత్ వాహన రంగం ద్వారా 40 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎలక్ట్రానిక్స్, విద్యుత్ వాహన రంగాల్లో పరిణామాలు తెలుసుకునేందుకు ప్రత్యేక నిపుణుల బృందం, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశాం.'