CM Jagan Review On Corona: కరోనా ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. ప్రికాషన్ డోస్ వ్యవధి 9 నుంచి 6 నెలలకు తగ్గింపుపై లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కొవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించిన జగన్.. ప్రికాషన్ డోస్ వ్యవధి తగ్గిస్తే ఫ్రంట్‌లైన్ వర్కర్లు, అత్యవసర సర్వీసుల సిబ్బందికి ఉపయోగమన్నారు. దీని ద్వారా ప్రజలు ఆస్పత్రిపాలు కాకుండా రక్షించే అవకాశం ఉందని చెప్పారు. కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్యపరమైన అవసరాలు గుర్తించాలని అధికారులకు సూచించారు. అవసరమైన ఆక్సిజన్, మందులు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
ప్రతి నియోజకవర్గానికీ ఒక కొవిడ్‌కేర్ సెంటర్ గుర్తించామని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో 28 వేల పడకలు సిద్ధం చేశామన్నారు. ఆరోగ్యశ్రీ కింద కరోనా రోగులకు సమర్థంగా సేవలందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఆరోగ్యమిత్రలు కీలకంగా వ్యవహరించాలన్నారు. సమన్వయం కోసం సాంకేతిక పరిజ్ఞానంతో యాప్ ఉండాలని సూచించారు. టెలీమెడిసిన్ ద్వారా వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.