విజయదశమి కానుకగా ప్రభుత్వం.. పేదల సొంతింటి కలను సాకారం చేసింది. హైదరాబాద్‌లో మూడు చోట్ల రెండు పడకల గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించింది. జియాగూడ నిర్మించిన ఇళ్లను.. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి.. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు నిర్వహించుకున్నామని కేటీఆర్ తెలిపారు. 75 ఏళ్లలో తొలిసారి ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తానంటున్న ఏకైక సీఎం కేసీఆరేనని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో లక్ష రెండు పడక గదుల ఇళ్లను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. నగరంలోని నిరుపేదలకు దశలవారీగా ఇళ్లను కేటాయిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
గతంలో అగ్గిపెట్టె, డబ్బాల్లాంటి ఇళ్లు ఇచ్చేవారని కేటీఆర్ విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలో కట్టిందే డబ్బా ఇళ్లు.. వాటిలో కూడా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇళ్లు కట్టకుండానే కట్టినట్లు చూపించి డబ్బు దండుకున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.