Water Man Of India : నదుల అనుసంధానం దేశానికి విపత్తుగా మారుతుందని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యకు పరిష్కారం అనుసంధానం కాదన్న ఆయన... వాటి పునరుజ్జీవన, సమర్థ నిర్వహణ కీలకమని అన్నారు. అనుసంధానం అవినీతికి దారి తీస్తుందని, నీటిపై ప్రైవేట్ వ్యక్తులు, బడా కంపెనీలకు గుత్తాధిపత్యం లభిస్తుందని రాజేంద్రసింగ్ అభిప్రాయపడ్డారు.
అందుకే తెలంగాణను ఎంచుకున్నాం..
నదుల పునరుజ్జీవమే లక్ష్యంగా ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్ వేదికగా నదులపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 200 కిలోమీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉండడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలను చూసి సదస్సుకు తెలంగాణను ఎన్నుకున్నట్లు ఆయన వివరించారు. అన్ని అంశాలను ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఉన్న తరహాలో వాటర్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజేంద్రసింగ్ విజ్ఞప్తి చేశారు.
నదులను పరిరక్షించుకోవాలి..
ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేకుండా కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఏం చేస్తాయని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల ఫోరం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన గెజిట్ నోటిఫికేషన్తో రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయనన్నారు. నదులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన... ఆ దిశగా అందరూ కలిసి రావాలని కోరారు.
'నదుల అనుసంధానం అవినీతికి ఆజ్యం పోస్తుంది' నదుల అనుసంధానం దేశానికి మంచిది కాదు. ఒక్క ముఖ్యమంత్రి కూడా తమ రాష్ట్రం వద్ద మిగులు జలాలు ఉన్నాయి.. వేరే రాష్ట్రానికి ఇస్తామని చెప్పడంలేదు. నదుల అనుసంధానాన్ని ప్రారంభిస్తే... రాజ్యాంగ, సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక సంక్షోభానికి దారి తీస్తుంది. ఇది దేశ అభివృద్ధి కోసం కాదు. నాశనం కోసమే. సమాజం, ప్రజల హక్కుల కోసం.. వారు ఆలోచించడం లేదు. నదుల అనుసంధానమంటే అవినీతిని, కాలుష్యాన్ని అనుసంధానించడమే. ప్రజల సొత్తు పెద్ద కంపెనీల జేబుల్లోకి వెళ్తుంది. నా దృష్టిలో ఇది నీటిని ప్రైవేటీకరణ, వాణిజ్యపరం చేయడమే. - రాజేంద్రసింగ్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా
ఇదీ చూడండి :సీఎం కేసీఆర్పై ఫిర్యాదు... కేసు నమోదు యోచనలో పోలీసులు!