travel on boat తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. దీంతో దిగువకు అంతే స్థాయిలో నీటిని వదులుతున్నారు. ఫలితంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి భారీగా ప్రవాహాన్ని విడిచిపెడుతున్నారు. వరద ఉద్ధృతితో కోనసీమ జిల్లాలోని గౌతమి, వైనతేయ, వశిష్ట నదీ పాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లంక గ్రామాలు ముంపులో చిక్కుకున్నాయి. మామిడికుదురు మండలం అప్పనపల్లిలో ఇళ్లను నీరు ముంచేసింది. నిత్యావసరాలతో పాటు రోజువారీ ప్రయాణాల కోసం.. స్థానికులు పడవలను ఆశ్రయించి వాటిపైనే రాకపోకలు సాగిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ప్రముఖ ఆలయమైన బాలబాలాజీ దేవాలయాన్ని అధికారులు మూసేశారు.
పి.గన్నవరం మండంలోని లంక గ్రామాలనూ వరద చుట్టుముట్టింది. ఏనుగుపల్లి లంక, జీ.పెదపూడి లంక, అయినవిల్లి - ఎదురుబీడుం కాజ్‌వేలపై వరద భారీగా ప్రవహిస్తోంది. పడవల్లోనే లంక వాసులు ప్రయాణం చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కనకాయలంక కాజ్‌వే పూర్తిగా మునిగింది. అల్లవరం మండలం బోడసకుర్రులోని పల్లెపాలెం గ్రామం మత్స్యకారుల ఇళ్లను.. వరద చుట్టుముట్టింది.