ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా..కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన రిజర్వాయర్లలోకి నీరు అంతంతమాత్రమే చేరింది. కృష్ణా బేసిన్‌లోని రిజర్వాయర్లలోకి సుమారు 100 టీఎంసీలు రాగా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లోకి 50 టీఎంసీలైనా రాలేదు. దీంతో ఆగస్టులో వచ్చే వరద కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.
కృష్ణా బేసిన్‌లో కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 97టీఎంసీలే వచ్చింది. ఇందులో 38టీఎంసీలకుపైగా విద్యుదుత్పత్తి ద్వారా దిగువన సాగర్‌కు విడుదలచేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలతోపాటు రాయలసీమలోని హంద్రీనీవా, తెలుగుగంగా, ఎస్సార్బీసీ తదితర ప్రాజెక్టులు శ్రీశైలం మీద ఆధారపడి ఉన్నాయి.
నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలకు శ్రీశైలం నుంచి విడుదల చేయాల్సిందే. ఎగువన కర్ణాటకలో ఉన్న ఆలమట్టిలోకి ఈ సీజన్‌లో 122 టీఎంసీలే వచ్చింది. మహారాష్ట్రలో ముంపు సమస్య రాకుండా ఉండేందుకు, నిర్వహణ మాన్యువల్ ప్రకారమే నీటిని నిల్వచేయాలని ఆదేశాలుండటంతో ఆలమట్టిలో 90టీఎంసీల వరకు నిల్వ ఉంచి దిగువకు వదిలేశారు. అటు ఆలమట్టి ఇటు భీమా నుంచి వచ్చిన ప్రవాహంతో జూరాలకు 82 టీఎంసీలు వచ్చింది.
జూరాల నుంచి దిగువకు వదిలిన నీరు, హంద్రీనది నుంచి వచ్చిన వరద కలిపి శ్రీశైలంలోకి 97 టీఎంసీలు వచ్చింది. ఆగస్టులో కనీసం 200 టీఎంసీలు వస్తే కానీ బేసిన్‌లోని ఆయకట్టు అవసరాలు తీరవు. దీంతో ఆగస్టులో లభ్యమయ్యే నీరు ప్రధానం కానుంది. గోదావరి బేసిన్‌లో నీటి లభ్యత తక్కువగా ఉంది. ప్రధాన గోదావరిలో శ్రీరామసాగర్‌లోకి 17, కడెం, ఎల్లంపల్లికి కలిపి 9 టీఎంసీలు వచ్చాయి. సీజన్ ప్రారంభంనాటికే ఉన్న నిల్వల కారణంగా ప్రస్తుతానికి సమస్య లేకపోయినా ఆగస్టులో తగినంత రాకపోతే ఇబ్బందే.
ప్రాణహితకు వచ్చిన నీటిలో కొంత నిల్వ ఉంచుకొని మిగిలింది దిగువకు వదిలేశారు. ఆగస్టులో ఎస్సారెస్పీ, ఎల్లంపల్లికి తగినంతగా వరద రాకపోతే కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ప్రాణహిత నుంచి వచ్చే నీటిని ఎత్తిపోసి ఎస్సారెస్పీ ఆయకట్టును ఆదుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు గోదావరి నది నుంచి ధవళేశ్వరం ద్వారా 150 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లింది. తక్కువ వెళ్లిన సంవత్సరాల్లో ఇదొకటని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
జూరాలకు స్వల్పంగా పెరిగిన వరద
జూరాల జలాశయానికి వరద స్వల్పంగా పెరిగింది. 22వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. జల విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు 16,291వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆలమట్టిలోకి వరద తగ్గింది. 4వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు 1700 క్యూసెక్కులు వదులుతున్నారు. నారాయణ్‌పూర్ జలాశయంలోకి 4వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దిగువకు 3వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
ఎగువ దిగువ జూరాల జల విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. 4యూనిట్లలో 156మెగావాట్ల ఉత్పత్తి వస్తున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి గురువారం వరద ప్రవాహం పెరిగింది. ఎగువన వర్షాలతో 14,500 క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లోగా వచ్చి చేరుతోంది. డ్యాంలోని 4 గేట్లను ఒక మీటరు మేర ఎత్తి 15,600 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంలోకి విడుదలచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసీకాలువకు 1,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. 292.00మీటర్ల గరిష్ఠస్థాయి నీటిమట్టం ఉన్న జలాశయంలో ప్రస్తుతం 291.20మీటర్ల నీటిమట్టం నమోదైనట్లు పేర్కొన్నారు.