రాష్ట్ర రాజధానిలో నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా... ఇంకా పలు బస్తీలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నాయి. సైదాబాద్ డివిజన్లోని సింగరేణి కాలనీలో.. 22 ఏళ్లుగా బస్తీవాసుల నీటి కష్టాలు తీరడం లేదు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. నగరంలోని పలు మార్కెట్లలో అల్లం, వెల్లుల్లి, పూలు, ఇతర సామాగ్రి అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. సుమారు 13 వేల కుటుంబాలున్న ఈ బస్తీల్లో 6 వేల మంది ఓటర్లున్నారు. వారంతా విధిగా ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి అభ్యర్థి వీళ్ల కష్టాలను చూసి వాగ్దానాలు చేసే వారే తప్ప... పరిష్కారం మార్గం చూపించడం లేదు. ఏళ్ల తరబడి ఈ బస్తీ వాసుల నీటి కష్టాలు, మురుగు నీటి పైపులైన్ల వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
ఒక్కో ఇంటికి ఒక డ్రమ్ము మాత్రమే..
బస్తీలకు మూడు రోజులకోసారి హైదరాబాద్ జలమండలి ట్యాంకర్ల ద్వారా ఉచిత నీటిని సరఫరా చేస్తోంది. ఒక్కో ఇంటికి కేవలం ఒక డ్రమ్ము మాత్రమే నీటిని అందిస్తున్నారు. డ్రమ్ముల్లో పోసిన నీటిని ఇళ్లకు తీసుకెళ్లేందుకు బస్తీ వాసులు సాహసమే చేస్తున్నారు. డ్రమ్ములకు ప్రత్యేక మోటార్లను బిగించి ఇళ్లకు పైపులు అమర్చుకున్నారు. ఆ పైపులూ చెట్లు, ఇళ్లపై నుంచి వేసుకోవడం గమనార్హం. అస్తవ్యస్తంగా ఉన్న మురుగునీటి వ్యవస్థ కారణంగా.. వచ్చే కొద్దిపాటి నీళ్లు ఏ మాత్రం వృథా కావొద్దని సింగరేణి కాలనీ ప్రజలు జాగ్రత్త పడుతున్నారు. జలమండలి సరఫరా చేసే నీరు ఏ మాత్రం సరిపోవడం లేదని వాపోతున్నారు..