తెలంగాణ

telangana

ETV Bharat / city

Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద - తెలంగాణ వార్తలు

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతూనే ఉంది. జలాశయం 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులకు చేరింది.

Srisailam water flow, floods to Srisailam
శ్రీశైలం జలాశయానికి వరద, శ్రీశైలం నీటి సామర్ధ్యం

By

Published : Aug 7, 2021, 10:12 AM IST

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. జలాశయం 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. జలాశయం ఇన్‌ఫ్లో 58,629 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 1,20,088 క్యూసెక్కులుగా నమోదవుతోంది. దీని పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకుంది.

శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 212.4385 టీఎంసీలుగా ఉంది. దీంతో.. శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 66,057 క్యూసెక్కులుగా నమోదవుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులుగా ఉంది.

పులిచింతలకు రిపేర్లు..

ఇదిలా ఉండగా పులిచింతల డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు, ఇంజినీరింగ్ నిపుణుల ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు సందర్శకులకు అనుమతి నిషేధించారు. డ్యాంలో విరిగిన గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ గేటును శుక్రవారానికి ఏర్పాటు చేస్తామని యంత్రాంగం చెప్పినా అది సాధ్యపడలేదు. అందుకు అవసరమైన ఏర్పాట్లలోనే యంత్రాంగం, బెన్‌కాం ప్రతినిధులు తలమునకలయ్యారు. జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు భారీగా పెరగడంతో జలాశయాన్ని ఖాళీ చేయించడం ఆలస్యమైంది. ఈ కారణంగానే తాత్కాలిక గేటు నిర్మాణ పనులు శుక్రవారం చేపట్టలేకపోయారు. జలాశయంలో నీటిమట్టం శుక్రవారం రాత్రికి 8 టీఎంసీల స్థాయికి చేరుకుంది. అయితే రాత్రి కావడంతో పనులు చేపట్టడం సాధ్యం కాదని భావించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయమే పనులు ప్రారంభించారు. సాధ్యమైనంత వరకూ స్టాప్‌లాక్‌ గేటు అమర్చాలని 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. శుక్రవారం సగటున 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపడంతో రాత్రికి జలాశయం అనుకున్న మేరకు ఖాళీ అయింది.

ఇదీ చదవండి:Nagarjuna sagar: ఎగువ నుంచి తగ్గుతున్న ప్రవాహం

ABOUT THE AUTHOR

...view details