గ్రేటర్ హైదరాబాద్‌లో నెలకు ఇరవై వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. ఖైరతాబాద్‌లోని కార్యాలయంలో ఉచిత నీటి పథకం పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
జలమండలి ఇప్పటికే శిక్షణ ఇచ్చిన మీటర్ రీడర్లు.. వినియోగదారుల ఇంటింటికి వెళ్లి ఆధార్ అనుసంధాన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తమ సీఏఎన్(క్యాన్) నెంబర్లతో ఆధార్ అనుసంధానం చేసుకోవడానికి మీ సేవ కేంద్రాల్లో నేటి నుంచి వెసులుబాటు కల్పించామని తెలిపారు. నల్లా కనెక్షన్ కలిగిన యజమాని స్వయంగా తమ ఆధార్ కార్డుతో పాటు గత 6 నెలల్లో జలమండలి జారీ చేసిన ఏదైనా ఒక బిల్లు కాపీని మీ-సేవ సెంటర్‌కి తీసుకెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నారు.