వరంగల్ ఎంజీఎం బాధితుడు మృతి.. హనుమకొండకు మృతదేహం తరలింపు - telangana hospital condition
![వరంగల్ ఎంజీఎం బాధితుడు మృతి.. హనుమకొండకు మృతదేహం తరలింపు hyderabad nims hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14905398-308-14905398-1648844743351.jpg)
01:42 April 02
వరంగల్ ఎంజీఎం బాధితుడు మృతి.. హనుమకొండకు మృతదేహం తరలింపు
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతిచెందాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో రాత్రి 12 గంటల సమయంలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిన్న సాయంత్రం మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్‌ను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. అయితే చికిత్సకు సహకరించక తీవ్ర అస్వస్థతతో మృతిచెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని.. భర్త మృతితో రోడ్డునపడ్డామని మృతుడి భార్య జ్యోతి కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని కుటుంబసభ్యులు హనుమకొండకు తరలించారు.
ఎంజీఎం వరంగల్ జిల్లాలో పేరెన్నికగన్న ప్రభుత్వ ఆస్పత్రి. ఎంతో మంది రోగులకు వరప్రదాయినిగా మారిన ఎంజీఎం .. మరికొందరు రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పెద్దాసుపత్రికి వచ్చిన రోగులకు ప్రాణాల మీద ఆశలు లేకుండా చేస్తోంది. ఇటీవల కాలంలో ఎలుకల కారణంగా కొందరు రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. గురువారం అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అసలే కిడ్నీ, లివర్ సమస్యలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శ్రీనివాస్ మీద ఎలుకలు.. రెండ్రోజుల వ్యవధిలో రెండుసార్లు దాడి చేసి కాళ్లు, చేతుల వేళ్లు కొరికాయి. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటువేసింది. మరో ఇద్దరు వైద్యులపైనా చర్యలు తీసుకొంది.
ఇవీచూడండి: