వివాహితతో ఎస్సై రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ప్రజల రక్షణ బాధ్యతలు చూసుకోవాల్సిన ఓ ఎస్సై రాసలీలల బాగోతం బయటపడింది. బాధ్యతాయుతమైన ఉద్యోగం చేస్తూ.. మరొకరి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డంగా దొరికిపోయాడు. ఎవరికో కాదు.. సదరు మహిళ భర్తే.. వీళ్ల వ్యవహారాన్ని కళ్లారా చూసి పట్టుకున్నాడు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాక ఇంకేముంది.. కోపంతో ఊగిపోతున్న ఆ భర్త ముందున్నది ఎస్సై అన్న విషయం పక్కన పెట్టేసి మరీ చితకబాదాడు. ఆగమని ఎంత వేడుకున్నా వినిపించుకోకుండా .. దొరికిన దొంగపై ఎస్సై ఎలానైతే ప్రతాపం చూపిస్తాడో... ఆ బాధిత భర్త కూడా అదే లెవల్లో రెచ్చిపోయాడు. ఈ తతంగమంతా... వనపర్తిలో చోటుచేసుకుంది.
వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో షేక్ షఫీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే.. కొంతకాలం నుంచి కొత్తకోటకు చెందిన వివాహితతో పరిచయం ఏర్పడింది. తరుచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ.. భర్తలేని సమయంలో ఇంటికి వెళ్లి రాసలీలలు కొనసాగిస్తున్నాడు. ఇలా వాళ్లిద్దరి మధ్య చాలా రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఎస్సై రాకపోకల వ్యవహారం కాస్తా.. వాళ్ల కంటా వీళ్ల కంట పడింది. వీళ్లిద్దరి బాగోతం స్థానికులకు అర్థం కావటంతో.. నేరుగా ఆమె భర్తకు తెలియజేశారు.
స్నేహితులకో కలిసి భర్త స్కెచ్
ఈ విషయం పూర్తిగా తెలుసుకున్న భర్త ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని స్కెచ్ వేశాడు. ఈ నెల 18న బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి వెళ్లిపోయాడు. ఆమెను నమ్మించి సమీపంలోనే స్నేహితులతో కలిసి కాపుకాశాడు. అనుకున్నట్టుగానే.. ఆ ఎస్సైకి మహిళ ఫోన్ చేసింది. ఇంకేముంది మన హీరో క్షణాల్లోనే వాళ్లింట్లో వాలిపోయాడు. వెంటనే పట్టుకోకుండా కొంతసేపు ఆ భర్త వేచిచూశాడు. ఇద్దరూ రాసలీలల్లో మునిగిపోయి ఉండగా.. భర్త తన స్నేహితుల సాయంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఆవేశంతో రగిలిపోయిన భర్త.. స్నేహితులతో కలిసి ఎస్సైని చితకబాదాడు. అడ్డొచ్చిన భార్యను కూడా చావబాదాడు.
వదిలేయమని ఎస్సై ప్రాధేయపడినా వినిపించకుండా.. దేహశుద్ధి చేయటంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎస్సైని కాపాడి వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు అతడిని హైదరాబాద్‌కు తరలించారు.
ఎస్సై సస్పెండ్
కంచే చేను మేసిందన్నట్టుగా.. రక్షించాల్సినోడే భక్షించాడన్నట్టుగా.. ఓ బాధ్యత గల పోలీసే మరొకరి భార్యతో ఇలాంటి సంబంధం పెట్టుకోవటం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఎస్సై షేక్ షఫీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. సస్పెండ్ వార్తతో.. వక్రబుద్ధి చూపెట్టిన పోలీసుకు తగిన శాస్తి జరిగిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.