తెలంగాణ

telangana

ETV Bharat / city

కొత్త సంఘాల్లో ఓటర్ల జోరు .. హైదరాబాద్​ శివారులో మారని తీరు - VOTERS IN NEWLY FORMED MUNICIPALITIES HAVE MORE JOSH ON VOTING

పురపాలక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 71.41 శాతం పోలింగ్ నమోదైంది. నగరపాలక సంస్థల్లో 58.86 శాతం నమోదు కాగా.. పురపాలక  సంఘాల్లో 74.73 శాతం ఓటింగ్ జరిగింది. చౌటుప్పల్​లో అత్యధికంగా  93.31 శాతం పోలింగ్ నమోదవగా.. నిజాంపేటలో కేవలం 39.65 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కొత్తగా ఏర్పడిన పురపాలికల్లో ఓటింగ్​కు ఓటర్లు ఆసక్తి చూపగా, హైదరాబాద్ శివారు వాసులు యథావిధిగా తక్కువ సంఖ్యలో ఓట్లు వేశారు.

VOTERS IN NEWLY FORMED MUNICIPALITIES HAVE MORE JOSH ON VOTING
కొత్త సంఘాల్లో ఓటర్ల జోరు .. హైదరాబాద్​ శివారులో మారని తీరు

By

Published : Jan 23, 2020, 5:19 AM IST

కొత్త సంఘాల్లో ఓటర్ల జోరు .. హైదరాబాద్​ శివారులో మారని తీరు

తొమ్మిది నగరపాలక సంస్థలు, 120 పురపాలక సంఘాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 49 లక్షల 73 వేల 281 మంది ఓటర్లకు గాను.. 35 లక్షల 51 వేల 325 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సగటున 71.41 శాతం పోలింగ్ నమోదైంది. పురపాలిక సంఘాలతో పోలిస్తే కార్పొరేషన్లలో తక్కువ ఓటింగ్ శాతం నమోదైంది.

ఎన్నికలు జరిగిన తొమ్మిది కార్పొరేషన్లలో సగటున 58.86 శాతం పోలింగ్ జరిగింది. రామగుండంలో 67.66 శాతం, బోడుప్పల్​లో 64.67 శాతం, పీర్జాదిగూడలో 64.31 శాతం, బడంగ్‌పేటలో 63.87 శాతం, నిజామాబాద్​లో 61.12 శాతం ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. బండ్లగూడ జాగీర్​లో 56.06 శాతం, మీర్​పేటలో 51.78, జవహర్​నగర్​లో 50.02 శాతం పోలింగ్ జరిగింది. నిజాంపేటలో కేవలం 39.65 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో జరిగిన చోట్ల ఇదే అత్యల్పం.

పురపాలక సంఘాల్లో సగటున 74.73 శాతం

120 పురపాలికల్లో సగటున 74.73 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా చౌటుప్పల్​లో 93.31 శాతం పోలింగ్ జరిగింది. పోచంపల్లిలో 92.51, చండూరులో 92.01, యాదగిరిగుట్టలో 90.69, ఆదిభట్లలో 90.27 శాతం పోలింగ్ నమోదయింది.

ఐదు చోట్ల 90 శాతానికి పైగా, 45 చోట్ల 80 శాతానికి పైబడి, 53 చోట్ల 70 శాతానికి పైగా, 16 చోట్ల 60 శాతానికి పైగా పోలింగ్ జరిగింది. జల్​పల్లిలో 46.91 శాతం, మణికొండలో 41.03 శాతం ఓటింగ్ నమోదైంది.

టాప్​-10లో 8 నల్గొండలోనివే..

తక్కువ ఓటింగ్ శాతం నమోదైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు.. హైదరాబాద్ చుట్టే ఉండటం గమనార్హం. యథావిధిగా శివారు ప్రాంతాలవారు ఓట్లు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొత్తగా ఏర్పాటైన పురపాలికల్లో అత్యధిక శాతం ప్రజలు ఓట్లు వేసేందుకు ఆసక్తి చూపారు. పోలింగ్ శాతం అధికంగా నమోదైన మొదటి పది పురపాలికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 8 ఉండడం విశేషం. నగర శివారులోని ఆదిభట్లలో మాత్రమే 90.69 శాతం పోలింగ్ నమోదైంది.

ఇవీచూడండి: బస్తీమే సవాల్: తెలంగాణ ఓటర్లలో పోటెత్తిన చైతన్యం

ABOUT THE AUTHOR

...view details