Vontimitta Kalyanam: శివధనుస్సు విరిచిన శ్రీరామచంద్రుడు పెళ్లి కుమారుడయ్యాడు. సీతాదేవిని మురిపించిన రఘుకుల సోముడు కల్యాణవేదికను అధిష్ఠించాడు. సిగ్గులొలుకుతూ కూర్చున్న జనకమహారాజు పుత్రికను పరిణయమాడాడు. పాంచరాత్ర ఆగమపండితుల మంత్రోచ్ఛరణలు, బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల ప్రతిధ్వనులు.. తరలివచ్చిన భక్తుల రామనామ స్మరణల మధ్య అయోధ్య రాముడు కల్యాణ రాముడయ్యాడు. ఆంధ్రా భద్రాద్రిగా పేరొందిన ఏపీ వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం శుక్రవారం రాత్రి శాస్త్రోక్తంగా సాగింది. జగదానందకరమైన జానకీకల్యాణ ఘట్టంలో జగదభిరాముడు సీతాసమేతుడై భక్తులకు దర్శనమిచ్చారు. ఎక్కడాలేని విధంగా పండువెన్నెలలో సీతారామకల్యాణం జరగడమన్నది ఒంటిమిట్టలోనే ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తోంది. సీతాదేవికి చంద్రుడు సోదరుడు కావడంతో ఆయన చూసేలా క్రతువు సాగుతుందని పండితులు చెబుతున్నారు. కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. 70 వేల మందికి తితిదే ఏర్పాట్లు చేసింది. విద్యుద్దీపకాంతుల మధ్య ఒంటిమిట్ట ఏకశిలా క్షేత్రం శోభాయమానంగా విలసిల్లింది.
సీఎం హోదాలో తొలిసారి...
సీతారాముల కల్యాణానికి ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా హాజరయ్యారు. కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఏకాంతంగా కల్యాణోత్సవం జరిగింది. ఈసారి బ్రహ్మోత్సవాలను తితిదే వైభవంగా నిర్వహిస్తోంది. అర్చకులు ముఖ్యమంత్రికి తలపాగా చుట్టగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకొచ్చిన పట్టువస్త్రాలు, తలంబ్రాలున్న పళ్లెం శిరస్సుపై ఉంచుకుని ఆయన ముందుకు కదిలారు. విశిష్ట పూజల అనంతరం వాటిని ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. వాటిని అలంకరించిన రుత్వికులు పూజలు ప్రారంభించి కల్యాణం జరిపించారు. తితిదే అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు.
రాజ్‌భవన్ తరఫున పట్టువస్త్రాల సమర్పణ...