జడ్జి రామకృష్ణ వేసిన అనుబంధ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధర్మాసనానికి సమర్పించిన పెన్ డ్రైవ్‌లో సంభాషణపై నిజనిర్ధరణ చేయాలని నిర్ణయించింది. విచారణ అధికారిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్‌ను నియమించింది. దర్యాప్తులో భాగంగా విచారణ అధికారికి అవరమైతే సీబీఐ, కేంద్ర విజిలెన్స్ అధికారులు సహకరించాలని తెలిపింది. సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టు ప్రాంగణాన్ని కరోనా రెడ్ జోన్‌గా ప్రకటించాలని పేర్కొంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య దాఖలు చేసిన పిల్‌పై విచారణను పునఃప్రారంభించాలని కోరుతూ జడ్జి రామకృష్ణ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను గత విచారణలో అనుమతించింది. పిల్లో ప్రతివాదిగా చేరి వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన మరో అనుబంధ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతినిచ్చింది.