గిరిపుత్రుల సంకల్పం... గ్రామాలకు రహదారులు ఏపీ విజయనగరం జిల్లా సాలూరు మండలం సంపంగిపాడు పంచాయతీ కాగురూడికి చెందిన జన్ని చిన్నమ్మకి ఇటీవల పురిటినొప్పులు వచ్చాయి. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేక బంధువులు సుమారు 3 కిలోమీటర్ల మేర డోలీలో ఆమెను ఒడిశాలోని ఈతవలసకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి జీపులో సాలూరులోని ఆసుపత్రికి తరలించారు. శృంగవరపుకోట మండలం దారపర్తి పంచాయతీ శివారు పల్లవుదుంగకు చెందిన గర్భిణీ రేగం లక్ష్మీ ఇదే పరిస్థితి. ఆమెకు పురిటినొప్పులు రావటంతో గ్రామస్థులు డోలీ కట్టి 9 కిలోమీటర్లు నడుచుకుంటూ మైదాన ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించారు. ఇలా ఒకరిద్దరు కాదు... గిరిజన ప్రాంతాల్లోని కొండ శిఖర గ్రామాల్లో ఇటువంటి దీనస్థితి నిత్యకృత్యం.
చందాలు వేసుకుని
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధి 8 మండలాల్లో గిరిజన గ్రామాలు విస్తరించి ఉన్నాయి. ఇందులో కొండ శిఖర ప్రాంతాల్లో 217 వరకు పల్లెలు కొలువుదీరాయి. ఈ గ్రామాలకు శతాబ్దాలు గడిచిన రహదారుల సౌకర్యం లేదు. దీంతో ఏడు గ్రామాల గిరిజనులు విద్య, వైద్యానికి దూరమవుతున్నారు. రహదారులకు నిధులు మంజూరు చేస్తున్నామని ఏటా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రసంగాలు చేస్తున్నారే గానీ.. ఆచరణకు నోచుకోవటం లేదు. రోడ్డు మంజూరైనా పలు రకాల కారణాలతో నిర్మాణానికి పునాది పడని పరిస్థితి. ఈ సమస్యలతో విసిగిపోయిన గిరిజనులు తమ కష్టాలకు తామే 'మార్గం' చూడాలనుకున్నారు. గ్రామస్థులందరూ చందాలు వేసుకుని రోడ్డు నిర్మించేందుకు పూనుకున్నారు. అవసరమైన చోట జేసీబీలతో మిగిలిన చోట శ్రమశక్తినే నమ్ముకుంటుని రోడ్డు వేసుకుంటున్నారు. గ్రామాలకు గ్రామాలే ముందుకొచ్చి.. రహదారి కలను సాకారం చేసుకుంటున్నాయి.
శ్రమదానంతో మట్టి రహదారి
సాలూరు మండలం గిరిజన ప్రాంతమైన బట్టివలస నుంచి రూడి వరకు రహదారి నిర్మాణానికి గ్రామస్థులు, యువకులు శ్రీకారం చుట్టారు. బట్టివలస, పుల్లమామిడి, రాంపాడు, గాలిపాడు, సలపరబండ, మరివలస, కాగిరూడి, ఎగువరూణీ, దిగువరూడి తదితర గ్రామాల గిరిజనులంతా ఈ రహదారి నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. ఇంటికి రూ.2 వేల చొప్పున నిధులు సేకరించారు. అవసరం ఉన్న చోట యంత్రాలను వినియోగిస్తూ సాధ్యమైనంత వరకూ తమ కష్టాన్నే నమ్ముకుని శ్రమదానం చేస్తున్నారు. ఇదే మండలం చింతామల గిరిశిఖర గ్రామాలు సిరివర, నారింజపాడు గిరిజనులు కూడా సొంతంగా రహదారిని అభివృద్ధి చేసుకుంటున్నారు. కేసలి పంచాయతీ షేరుగుడ్డి నుంచి కాట్రగుదడ్డి వరకు సరైన రహదారి సౌకర్యం లేదు. గ్రామస్థులు చందాలు వేసుకుని రూ.80 వేలు సేకరించారు. ఆ మొత్తంతో జేసీబీని ఏర్పాటు చేసుకుని, శ్రమదానం చేసి మట్టి రహదారిని నిర్మించుకుంటున్నారు. షేరుగుడ్డి నుంచి ఇప్పలగుడ్డి, కాట్రగుడ్డి వరకు సుమారు రెండున్నర కిలోమీటర్ల మేర మార్గాన్ని వేసుకున్నారు. కరడవలస గిరిజనలు కూడా ఇదే బాట పట్టారు. జాతీయ రహదారి-26 నుంచి ఏడు కిలో మీటర్ల మేర కరడవలస గిరిజనులు కూడా దారి నిర్మాణం చేపట్టారు. ప్రతి కుటుంబానికి 3 వేలు చొప్పున నిధులు సమాకూర్చుకుని, మూడు రోజుల పాటు శ్రమదానం చేసి., కరడవలస, కొత్తకరడవలస వరకు బాటను నిర్మించుకున్నారు.
స్ఫూర్తిగా నిలుస్తున్నారు
గుమ్మలక్ష్మీపురం ఇదే మండలం ఓండ్రు బంగి గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. దీంతో సుమారు 85 కుటుంబాలు ఇంటికి రూ.2500 రూపాయలు చొప్పున సేకరించారు. జేసీబీతో కొండను తవ్వించి గ్రామస్థులు శ్రమదానం చేసి రోడ్డును బాగు చేసుకున్నారు. ఇదే మండలంలోని కీసర నుంచి కేదారిపురం కూడలి వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డును గ్రామస్థులు బాగుచేశారు. ప్రభుత్వం రహదారి బాగుచేస్తుందని ఎన్నో ఏళ్లు చూశారు. వారెవరూ స్పందించలేదు. చివరికి గ్రామస్థులే రహదారి బాగు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంటింటికీ చందాలు వేసుకుని డబ్బులు పోగు చేసుకున్నారు. ఇలా రహదారులు బాగు చేసుకుని మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు విజయనగరం జిల్లాలోని గిరిశిఖర గ్రామాల గిరిజనులు.
ఇదీ చదవండి :గతంలో కంటే నాలుగు స్థానాలు అధికంగా వస్తాయి: కేసీఆర్