తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇండియన్‌ ఐడల్లో తెలుగు యువతి షణ్ముఖప్రియ ప్రతిభ - vizag latest news

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖకు చెందిన షణ్ముఖప్రియ తన మధుర గానంతో సంగీత ప్రపంచంలో సత్తా చాటుతోంది. 'ఇండియన్ ఐడల్​' కు ఎంపికై ప్రతిభను నిరూపించుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి ఎంపికైన మొదటి తెలుగు యువతిగా రికార్డు సృష్టించింది. ఇప్పటికే 11 రియాల్టీ షోల్లో విశేష ప్రతిభ కనబరించింది.

vizag-singer-shanmukhapriya-got-two-golden-mikes-in-indian-idol-program
ఇండియన్‌ ఐడల్లో తెలుగు యువతి షణ్ముఖప్రియ ప్రతిభ

By

Published : Nov 30, 2020, 7:45 PM IST

ఇండియన్‌ ఐడల్లో తెలుగు యువతి షణ్ముఖప్రియ ప్రతిభ

సోనీ టీవీ జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'ఇండియన్‌ ఐడల్‌' (సీజన్ 12)' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ యువతి ఎంపిక కావడమే కాకుండా రెండు గోల్డెన్‌ మైక్‌లు సాధించి తన ప్రతిభ నిరూపించుకుంది. తల్లిదండ్రులిద్దరూ సంగీతాభిమానులు కావటంతోపాటు షణ్ముఖప్రియ చిన్ననాటి నుంచే సంగీతంపై అంతులేని అభిమానాన్ని పెంచుకుంది. ఇప్పటికే 11 రియాల్టీ షోల్లో ప్రతిభ చూపి ప్రశంసలందుకుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇండియన్ ఐడల్​కు ఎంపికైన మొదటి తెలుగు యువతిగా రికార్డు సృష్టించింది. తన సంగీత ప్రస్థానం ఆమె మాటల్లోనే.

పట్టుదలతో చేసిన ప్రయత్నం

నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టం. నా తండ్రి శ్రీనివాస్‌ వీణ వాయిద్యంలోనూ, తల్లి రత్నమాల పాటలు పాడడంలో నిష్ణాతులు. సంగీతం అంటే ఏమిటో తెలియని రోజుల నుంచే అమ్మానాన్నలతో కచేరీలకు వెళ్లేదాన్ని. దీనివల్ల నాకు తెలియకుండానే సంగీతంపై మమకారం పెరిగింది. ఆ ఆసక్తిని గమనించి నా తల్లిదండ్రులు పాటలు పాడడం నేర్పారు. మొట్టమొదటిసారిగా 2008వ సంవత్సరంలో జీ-తెలుగు సంస్థ నిర్వహించిన ‘'సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌'’ పోటీలో పాల్గొని టైటిల్‌ దక్కించుకున్నాను. అప్పుడు నా వయసు ఐదేళ్లు. ఆ తరువాత 2009లో మా టీవీ సూపర్‌సింగర్‌-4లో రెండో స్థానంలో నిలిచాను. స్టార్‌ విజయ్‌ ఛానెల్‌ వాళ్లు 2010వ సంవత్సరంలో‘తమిళ్‌ జూనియర్‌ సూపర్‌ స్టార్స్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నేను తమిళంలోనే పాడాల్సి ఉంటుంది. విజేతగా నిలవాలన్న లక్ష్యంతో తమిళ భాషను కూడా కొంత వరకు నేర్చుకున్నాను. నాకప్పుడు ఎనిమిదేళ్లే. తెలుగుపైనే పూర్తి అవగాహన లేని వయస్సు. అయినప్పటికీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ భాష నేర్చుకున్నాను. ఎంతో పట్టుదలతో చేసిన నా ప్రయత్నాలు ఫలించి విజేతగా నిలిచాను. ఆ ఛానల్ వాళ్లు పాండిచ్చేరిలో డ్లూప్లెక్స్‌ గృహాన్ని నాకు బహుమతిగా ఇచ్చారు.

ఆయన ప్రశంసలను మరువలేను

‘ఈటీవీ’ 2013వ సంవత్సరంలో నిర్వహించిన ‘'పాడుతా తీయగా'’లో పాల్గొని రన్నరప్‌గా నిలవడం మరువలేని అనుభూతి. ఆ కార్యక్రమానికి వచ్చిన రామోజీరావు గారు నన్ను అభినందించిన క్షణాలను నేను మరువలేను. హిందీ పాటల్లోనూ మంచి ప్రవేశం ఉంది. ‘జీ- హిందీ’ సంస్థ 2017వ సంవత్సరంలో నిర్వహించిన ‘సరిగమప లిటిల్‌ ఛాంప్స్‌’లో రన్నరప్‌గా నిలిచాను. మాటీవీ ఛానెల్‌ 2015వ సంవత్సరంలో సూపర్‌సింగర్‌-9లో నిర్వహించినప్పుడు గాయని కల్పన బృందంలో నేను సభ్యురాలిగా ఉన్నాను. మా బృందం విజేతగా నిలిచింది. జెమినీ ‘స్టార్‌ ఆఫ్‌ ఏపీ’ పోటీలో పాల్గొన్నాను.

తల్లిదండ్రుల ప్రోత్సాహమే కీలకం

చిన్ననాటి నుంచి నా తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, సలహాలు, సూచనలే నాకు శ్రీరామరక్ష. నేను విజేతగా నిలవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై ఎప్పటికప్పుడు నన్ను అప్రమత్తం చేస్తుంటారు. ఖాళీ సమయాల్లో కూడా సంగీత సాధన చేస్తుంటాను.

విదేశాల్లోనూ పాటలు పాడా

బ్రిటన్, హాలాండ్, కెనడా, అమెరికా తదితర ఎనిమిది దేశాలు తిరిగాను. ‘రాక్‌ ఆన్‌ మ్యూజిక్‌’ బ్యాండ్‌ తరపున వివిధ అంతర్జాతీయ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాను. లండన్‌లో మైఖేల్‌జాక్సన్‌ ప్రదర్శన ఇచ్చిన ఓ2 వేదికపై నాకు పాడే అవకాశం రావడం మరువలేను.

యూడ్లింగ్‌లో ప్రావీణ్యం నా ప్రత్యేకత

హిందీ గాయకుడు కిశోర్‌కుమార్‌ను చూసి యూడ్లింగ్‌ను సాధన చేశాను. వాస్తవానికి మహిళలు యూడ్లిండ్‌ చేయడం ఒకింత కష్టం. అయినప్పటికీ యూడ్లింగ్‌ సాధన చేసి విజయం సాధించాను. ఇండియన్‌ ఐడల్‌లో యూడ్లింగ్‌ పాడిన మొట్టమొదటి అమ్మాయిగా కూడా గుర్తింపు పొందాను.

ఇదీ చూడండి :సీఎం ఫోటోలు మార్ఫింగ్.. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details