YS Viveka Murder Case Update : మాజీ మంత్రి వివేకా మృతి సమాచారం వెలుగుచూశాక తొలుత ఆయన ఇంట్లోని బాత్‌రూమ్, బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించింది వై.ఎస్.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలేనని వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్ ఇనయతుల్లా సీబీఐకి చెప్పారు. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు మృతదేహాన్ని చూసి బయటకు వచ్చాక మిగిలినవారు లోపలికెళ్లారని.. బెడ్‌రూమ్‌లోని రక్తం, వివేకా మృతదేహం ఫొటోల్ని తాను తీశానని వివరించారు. తాను ఫొటోలు తీస్తున్నట్లు గుర్తించిన ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి (అవినాష్‌రెడ్డి కజిన్) తనపై కేకలు వేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వై.ఎస్.భాస్కర్‌రెడ్డి, వై.ఎస్.మనోహర్‌రెడ్డిలు సంఘటనాస్థలానికి చేరుకున్నారని తెలిపారు. వారి రాక ముందే వివేకా మృతదేహానికి సంబంధించిన వీడియోలను చిత్రీకరించానన్నారు. ఆ సమయంలో వివేకా పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి గదిలో ఉన్నారని.. వివేకాకు ఏదో జరిగిందన్న అనుమానం తనకు ఉందంటూ ఆయనతో చెప్పానని ఇనయతుల్లా వెల్లడించారు. సరిగ్గా అదే సమయంలో వై.ఎస్.అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వై.ఎస్.మనోహర్‌రెడ్డి, వై.ఎస్.భాస్కర్‌రెడ్డిలు గదిలో చర్చించుకుంటూ కనిపించారని తెలిపారు. కొంతసేపయ్యాక వివేకా గుండెపోటుతో చనిపోయారని.. గాయాలకు బ్యాండేజీ, కాటన్ చుట్టాలంటూ వారు చెప్పారని వెల్లడించారు.
- ఈ మేరకు గతేడాది డిసెంబరు 8న సీబీఐ అధికారులకు ఆయనిచ్చిన వాంగ్మూలం ప్రతులు గురువారం వెలుగుచూశాయి. అందులోని ప్రధానాంశాలివి.
"వివేకా ఇంట్లోని రక్తపుమడుగు శుభ్రం చేయించాలని ఎర్ర గంగిరెడ్డి నాతో చెప్పారు. ఆ మాటలకు నేను సరిగ్గా స్పందించకపోయేసరికి 3సార్లు గట్టిగా కేకలు వేశారు. గంగిరెడ్డి ఎందుకు అంతలా కంగారు పడుతున్నాడు? రక్తపుమడుగు శుభ్రం చేయించాలని ఎందుకు అడుగుతున్నాడు? అంటూ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డిని ప్రశ్నించా. తనకూ అదే అర్థం కావట్లేదంటూ ఆయన సమాధానమిచ్చాడు. ఆ తర్వాత వై.ఎస్. భాస్కర్‌రెడ్డి, వై.ఎస్. మనోహర్‌రెడ్డిలు వివేకా మృతదేహాన్ని ఉంచేందుకు ఇంట్లోకి ఫ్రీజర్ బాక్సు తెప్పించారు".