తెలంగాణ

telangana

ETV Bharat / city

'కళ్లు కనిపించకున్నా... కలెక్టర్ కావాలని కలలు కన్నా' - సివిల్ ర్యాంకప్ పూర్ణ సుందరి

ఆటపాటలే లోకమైన ఆ చిన్న వయసులోనే... ఒకరోజు బోర్డు మసకగా కనిపించడం మొదలైందా చిన్నారికి. ఆ మసకచూపుతోనే ఆరోతరగతి వరకు చదివింది. ఆ తర్వాత పూర్తిగా అంధురాలైంది. అలాగని చదువు మానలేదు. బ్రెయిలీ నేర్చుకుంది. చదువు కొనసాగించింది. ఇలా చాలా మందే ఉండొచ్చు. కానీ సివిల్స్‌ ఎంతమంది సాధించి ఉండొచ్చు? ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. అనుకున్నది సాధించొచ్చని నిరూపించిందీ అమ్మాయి.

purna sundari
purna sundari

By

Published : Aug 7, 2020, 8:46 AM IST

కంటి చూపులేని ఆ అమ్మాయికి అమ్మే కంటిచూపై పాఠాలు వినిపించింది. ఆమె కష్టాన్ని అర్థం చేసుకున్న కూతురు పూర్ణ సుందరి.. సివిల్స్‌లో ర్యాంకు సాధించి అమ్మకు కానుకగా ఇచ్చింది...

మదురైలోని మణినగరానికి చెందిన మురుగేశన్‌ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరిలో పెద్ద అమ్మాయి పూర్ణసుందరి. ఓ ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్‌ విభాగంలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే మురుగేశన్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆయన పెద్దగా చదువుకోలేదు. అందుకే పిల్లలనైనా చదివించాలనుకున్నాడు. తీరా ఒకటో తరగతిలో చేరిన కొన్ని రోజులకే ‘బోర్డుపై అక్షరాలు కనిపించడం లేదు నాన్నా’ అని చిన్నారి పూర్ణ అంటే... ‘కంట్లో నలక పడి ఉంటుందిలేమ్మా’ అని సర్దిచెప్పాడు. రోజులు గడుస్తున్నా ఆ సమస్య అలాగే ఉండిపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. కానీ తిరగని ఆసుపత్రి లేదు.

బ్రెయిలీ నేర్చుకుని...

హైస్కూల్‌లో చేరాలనుకునే సమయానికి పూర్ణ పూర్తిగా కంటిచూపుని కోల్పోయింది. బ్రెయిలీ నేర్చుకుంది. అంధులకోసం నడిపే ప్రత్యేక పాఠశాలలో చేరింది. ‘అమ్మే నాకు తొలి ఉపాధ్యాయురాలు. స్కూల్లో చెప్పే ప్రతి పాఠాన్నీ నాకు చదివి వినిపించేది. అలా మా అమ్మవల్ల పదోతరగతిలో ఫస్ట్‌ వచ్చా. ఇంటర్లోనూ టాపర్‌నే. ఇలా ప్రతి తరగతిలో నేను ఒక్కో మెట్టు ఎక్కుతుంటే మా అమ్మ కష్టం కూడా పెరిగేది. ఇంతలో ప్రభుత్వం ఇచ్చిన ఉచిత కంప్యూటర్‌ నా చదువుకెంతో ఉపయోగపడింది. ఇంటర్‌లోనే సివిల్స్‌ రాయాలని కలెక్టర్‌ కావాలని కలలు కనడం మొదలుపెట్టాను. అందుకు తగ్గట్టుగా మెటీరియల్‌ను సేకరించేదాన్ని. దాన్ని ఆడియో ఫార్మేట్‌లో స్నేహితులు మార్చేవారు. అమ్మైతే నాలుగున్నరకు నాతోపాటు నిద్రలేచి, పాఠాలు చదివి వినిపించేది. రాత్రి పనంతా అయిన తరువాత కూర్చుని పాఠాలు వినిపించేది’ అంటూ అమ్మ కష్టం గురించి వివరించింది పూర్ణ.

మహిళలు శక్తిమంతులు. దేన్నైనా గెలవగలరు...

2016 నుంచి సివిల్స్‌ రాయడం మొదలుపెట్టిన పూర్ణకి మొదటిసారి ఇంటర్వ్యూలో మార్కులు తక్కువ వచ్చాయి. దాంతో బ్యాంకు పరీక్షలు రాసి తమిళనాడు గ్రామీణ బ్యాంకులో క్లర్క్‌ ఉద్యోగంలో చేరింది. కానీ తన లక్ష్యాన్ని మాత్రం మర్చిపోలేదు. ‘ప్రయత్నించకుండా రాలేదని బాధపడకూడదు. మూడుసార్లు రాశా. సాధించలేకపోయా. నాలుగోసారి ఇంకా పట్టుదలగా ప్రయత్నించా. ఆల్‌ ఇండియా సివిల్‌ కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నా. అప్పుడు కూడా అమ్మ నాకు తోడుగా ఉంది. తాజా ఫలితాల్లో 286వ ర్యాంకును సాధించా. అమ్మా, నాన్న సంతోషానికి హద్దుల్లేవు. ఎన్నో సామాజిక సేవాసంస్థలు కాదనకుండా నాకు ఆర్థిక సాయం చేశాయి. మహిళలు శక్తిమంతులు. దేన్నైనా గెలవగలరు. ఎవరేం చెప్పినా... మనపై మనకు నమ్మకం ఉంటే చాలు. చివరి విజయం మనదే అవుతుంది’ అని అంటోంది పూర్ణ.

ABOUT THE AUTHOR

...view details